అనంతపురం అగ్రికల్చర్: ఎన్నో వ్యయప్రయాసలకోర్చి సాగు చేసిన అరటి.. కోతకు వచ్చేసరికి ధర పతనమవడం రైతుల్లో తీవ్ర అలజడి రేపుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరి 20న టన్ను రూ.22 వేలు ఉన్న అరటి ధర క్రమంగా తగ్గుతూ ఇపుడు రూ.7 వేలకు చేరింది. రోజురోజుకూ రైతుల పరిస్థితి దీనంగా మారుతున్నా చంద్రబాబు ప్రభుత్వం ఆదుకునే చర్యలు చేపట్టడం లేదు. ఇక జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులకు కూడా వీరి గురించి పట్టించుకునే తీరిక లేకపోయింది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికి 2 లక్షల మెట్రిక్ టన్నుల వరకు అరటి కోతలకు సిద్ధంగా ఉన్నా.. ధర పడిపోవడం, వ్యాపారులు మొగ్గు చూపకపోవడంతో అయినకాటికి అమ్మేసుకునే దుస్థితి నెలకొంది.
అరటి ఎగుమతులపై వార్ ఎఫెక్ట్
జిల్లా వ్యాప్తంగా 40 వేల ఎకరాల్లో అరటి సాగైంది. ఈ సీజన్‌లో మొదటి పంట కింద 5 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. అందులో ఇప్పటికే సగానికి పైగా అమ్ముకున్నట్లు అధికారులు చెబుతున్నారు. అమెరికా, ఇజ్రాయిల్– ఇరాన్ మధ్య యుద్ధం మొదలు కావడంతో అది కాస్తా గల్ఫ్ దేశాలు అంతటా విస్తరించడంతో అరటి ఎగుమతులు పూర్తిగా ఆగిపోయినట్లు చెబుతున్నారు. దీంతో ఉత్తరాది వ్యాపారులు అరటి కొనుగోలుకు వెనకాడుతున్నట్లు తెలుస్తోంది. టన్ను రూ. 7 వేలు లేదా రూ.8 వేలకు అమ్ముడుబోయినా పెట్టుబడి తిరిగివచ్చే పరిస్థితి లేదని ఆవేదన చెందుతున్నారు. గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.


