‘దూకుడు’కు ముకుతాడు! | - | Sakshi
Sakshi News home page

‘దూకుడు’కు ముకుతాడు!

Mar 12 2026 7:31 AM | Updated on Mar 12 2026 7:31 AM

అనంతపురం ఎడ్యుకేషన్‌: అనంతపురం రెవెన్యూ డివిజనల్‌ అధికారి (ఆర్డీఓ) కేశవనాయుడు సెలవుపై వెళ్లారు. ఈ నెల 7 నుంచి 20 దాకా సెలవు పెట్టారు. ఇటీవల కాలంలో ఆయనపై వస్తున్న విపరీతమైన ఆరోపణల నేపథ్యంలో సెలవుపై వెళ్లడం రెవెన్యూ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. పైకి అనారోగ్యం అని చెబుతున్నా... అసలు కారణం వేరేనని కార్యాలయ ఉద్యోగులే చెబుతున్నారు. భూ వివాదాల కేసుల్లో ఆర్డీఓ తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలు డివిజన్‌లోనే కాదు ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. రిటైర్డ్‌మెంట్‌ దగ్గర పడడంతో పెద్ద ఎత్తున వసూళ్లకు తెర తీశారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇందులో భాగంగానే జిల్లా చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా ప్రతివారం 100కు పైగా ఆర్‌ఓఆర్‌ కేసులను విచారణకు పిలుస్తుండడాన్ని రెవెన్యూ ఉద్యోగులు, న్యాయవాదులు తప్పుపడుతున్నారు. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుని ఉత్తర్వులు ఇస్తూ వివాదాలను మరింత జఠిలం చేస్తున్నారని వాపోతున్నారు. ఈయన ఇచ్చిన చాలా తీర్పులపై హైకోర్టు మొటిక్కాయలు వేస్తూ డిస్మిస్‌ చేసింది.

అక్రమాలపై గుట్టుగా విచారణ

పెద్ద ఎత్తున వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ‘రెవెన్యూ అధికారి దూకుడు’ శీర్షికతో ‘సాక్షి’లో గతనెలలో వెలువడిన కథనం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కొందరు ఉద్యోగులు, బాధితులు రాష్ట్రస్థాయి సోషల్‌ మీడియా గ్రూపుల్లో పోస్ట్‌ చేయడంతో దుమారం రేగింది. చివరకు సీఎంఓ దృష్టికి కూడా వెళ్లింది. ఇంటెలిజెన్స్‌ అధికారులు ఆరా తీశారు. కొందరు బాధితులు, తహసీల్దార్లు, మరీ ముఖ్యంగా బాధితులుగా ఉన్న వీఆర్‌ఓలతో మాట్లాడి నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి పంపినట్లు తెలిసింది. ఇదే క్రమంలో కలెక్టర్‌ కూడా గుట్టుగా విచారణ చేయించారు. ఓ జిల్లాస్థాయి అధికారిని నియమించి విచారణ నివేదిక తెప్పించుకున్నట్లు సమాచారం. ఇదే సమయంలోనే ఓ రైతు స్వయంగా కార్యాలయంలో అధికారిని నిలదీసినట్లు తెలిసింది. తాను ఇచ్చిన డబ్బును వెనక్కు ఇవ్వాలంటూ గట్టిగా కేకలు వేయడంతో ఉద్యోగులంతా బెంబేలెత్తినట్లు సమాచారం. ఎట్టకేలకు అధికారి వ్యవహారం వెలుగులోకి రావడంతోనే దూకుడుకు కూడా కొద్దివరకు స్పీడ్‌ బ్రేకర్‌ పడిందని రెవెన్యూ ఉద్యోగులు చెబుతున్నారు. అధికార పార్టీకి బలంగా మద్దతిచ్చే సామాజిక వర్గం వ్యక్తి కావడంతోనే ఆయనపై చర్యలు చేపట్టేందుకు ఉన్నతాధికారులు ఆలోచనలో పడినట్లు తెలిసింది. పైగా ఓ మంత్రి, ఇద్దరు ఎమ్మెల్యేలు ఈయనకు బహిరంగంగానే మద్దతిస్తున్నారనే అపవాదు ఉంది.

అన్నింటికీ అడ్డుపుల్ల వేస్తున్న కీలక అధికారి

ఆర్డీఓ కార్యాలయంలో కీలక విధులు నిర్వహిస్తున్న ఓ డీటీ ప్రతి ఫైలుకూ అడ్డుపుల్ల వేస్తున్నట్లు తెలిసింది. ఈయన చెప్పిందే వేదం.. చేసిందే శాసనంగా కార్యాలయంలో అమలవుతోంది. ఈయన చెప్పినమాటే ఆర్డీఓకు కూడా వేదం అని అంటున్నారు. ఈయన దెబ్బకు వీఆర్‌ఓలు, బాధిత రైతులు ఆర్డీఓ కార్యాలయానికి రావాలంటే జంకుతున్నారు. ముఖ్యంగా చుక్కల భూమి, 22ఏ ఫైళ్లకు సంబంధించి ఆర్డీఓ కంటే ముందు ఈయనే కొర్రీలు వేస్తున్నాడు. వీఆర్‌ఓ, ఆర్‌ఐ, డీటీ, తహసీల్దారు సంతకాలతో తయారు చేసిన ఫైళ్లను కనీసం చూడకుండా తిరస్కరిస్తున్నట్లు తెలిసింది. ఒకటికి పదిసార్లు పరిశీలించుకుని పెట్టిన ఫైళ్లను తమకంటే కిందిస్థాయి ఉద్యోగి తిరస్కరించడాన్ని తహసీల్దార్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈయన దెబ్బకు కొందరు తహసీల్దార్లు ఆయన చాంబరులోకి వెళ్లాలంటే కూడా జంకుతున్నారు. ఇక వీఆర్‌ఓల పరిస్థితి అయితే మరీ దారుణం. ఈ పోస్టులో తహసీల్దారు స్థాయి ఉద్యోగిని నియమించాల్సి ఉన్నా.. అనుకూలత కోసం డిప్యూటీ తహసీల్దారును నియమించారనే ఆరోపణలున్నాయి. ప్రతిదీ కిందిస్థాయి ఉద్యోగితో చెప్పించుకోవాల్సి రావడంపై తహసీల్దార్లు రగిలిపోతున్నారు. కలెక్టర్‌ దృష్టి సారించి ఇక్కడ డీటీ స్థాయి అధికారి సాగిస్తున్న దందాపై విచారణ జరిపించాలని తహసీల్దార్లు, డీటీలు, ఆర్‌ఐలు. మరీ ముఖ్యంగా వీఆర్‌ఓలు విజ్ఞప్తి చేస్తున్నారు.

20 వరకు సెలవు పెట్టిన అనంతపురం ఆర్డీఓ

విపరీతమైన ఆరోపణల నేపథ్యంలోనే లీవ్‌

గుట్టుగా విచారణ చేసిన జిల్లాస్థాయి అధికారులు

ఇంటెలిజెన్స్‌ వర్గాల ఆరా... ప్రభుత్వానికి నివేదిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement