గుంతకల్లు రూరల్: ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో ఉగాది ఉత్సవాలు ఈ నెల19న ప్రారంభం కానున్నాయి. గురువారం గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, ఆలయ ఈవో మేడేపల్లి విజయరాజు ఉగాది ఉత్సవాల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈవో మేడేపల్లి విజయరాజు మాట్లాడుతూ ఉత్సవాల్లో భాగంగా ఈనెల 19న గ్రామోత్సవం, పంచాంగ శ్రవణం, 20వ తేదీన స్వామివారి రథోత్సవం, 21న లంకాదహనం కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఉత్సవాలు జరగనున్న మూడు రోజులూ భక్తుల కాలక్షేపం కోసం సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. భక్తులు భారీ సంఖ్యలో హాజరై ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆయన కోరారు.
బాలుడి హత్య కేసులో ముగ్గురికి జీవిత ఖైదు
● జిల్లా కోర్టు సంచలన తీర్పు
కళ్యాణదుర్గం రూరల్/అనంతపురం: బాలుడి హత్య కేసులో జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ముగ్గురు ముద్దాయిలకు జీవిత ఖైదు విధించింది. కళ్యాణదుర్గం రూరల్ సీఐ నీలకంఠేశ్వర తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. శెట్టూరు మండలం తిప్పనపల్లికి చెందిన గొల్ల ఈరన్న కుమారులు సన్న ఈరన్న, చిత్తప్పలకు భూమి పంపకాల విషయంలో గొడవలు ఉన్నాయి. సన్న ఈరన్న కుమారుడు విష్ణువర్దన్ (11) తన చిన్నాన్న చిత్తప్ప తోటలోకి నీరు తాగడానికి వెళ్లి అక్కడ ఒక మామిడిపండు, వేరుశనగ కాయలు తీసుకున్నాడు. ఈ క్రమంలోనే విష్ణువర్ధన్‌ను అడ్డగించిన చిత్తప్ప, బాలుడి తాత ఈరన్న, మామ మురుకుందప్పలు ఎందుకు తోటలోకి వచ్చావని ప్రశ్నించారు. తోటలో తనకు కూడా హక్కు ఉందని విష్ణువర్ధన్ అనడంతో కోపోద్రిక్తులైన ముగ్గురూ బాలుడిని కొట్టి, తాడును అతడి మెడకు బిగించడంతో మరణించాడు. అనంతరం అక్కడే ఉన్న టార్ఫాలిన్ పట్టలో చుట్టి గడ్డివాములో దాచిపెట్టి ముగ్గురూ వెళ్లిపోయారు. 2022 సంవత్సరం ఏప్రిల్ ఆరో తేదీన ఈ ఘటన జరిగింది. దీనిపై బాలుడి తండ్రి సన్న ఈరన్న ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్‌ఐ యువరాజ్ కేసు నమోదు చేయగా.. కళ్యాణదుర్గం సీఐ శ్రీనివాసులు సమగ్ర దర్యాప్తు చేసి కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. కేసులో తొమ్మిది మంది సాక్షులను కోర్టు విచారించింది. ముద్దాయిలపై అభియోగాలు రుజువు కావడంతో ముగ్గురికీ జీవిత ఖైదు విధిస్తూ అనంతపురం ప్రిన్సిపల్ జిల్లా జడ్జి భీమారావు గురువారం తీర్పు వెలువరించారు. అలాగే ఏ1 గొల్ల చిత్తప్పకు రూ.25 వేలు, ఏ2 గొల్ల ఈరన్నకు రూ.50 వేలు, ఏ3 మురుకుందప్పకు రూ.10 వేలు జరిమానా విధించారు. జరి మానా కట్టని పక్షంలో మరో మూడు నెలలు అదనంగా శిక్ష అనుభవించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. కేసులో ముద్దాయిలకు శిక్ష పడేలా కృషి చేసిన కోర్టు మానిటరింగ్ సిస్టం లైజన్ ఆఫీసర్ మారెన్న (ఏఎస్‌ఐ), కోర్టు లైజన్ ఆఫీసర్ మల్లారెడ్డి (ఏఎస్‌ఐ), కానిస్టేబుళ్లు కృష్ణమోహన్, రామమోహన్, కుళ్లాయిస్వామిని ఎస్పీ జగదీష్, కళ్యాణదుర్గం డీఎస్పీ రవిబాబు అభినందించారు.


