బుక్కరాయసముద్రం: మహిళపై దాడి చేసి, ఆమె మెడలోని బంగారు గొలుసును అపహరించిన కేసులో ఓ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక పీఎస్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుడి వివరాలను అనంతపురం రూరల్ డీఎస్పీ మహబూబ్‌బాషా వెల్లడించారు. గత నెల 14న బీకేఎస్‌లోని గాంధీనగర్ సమీపంలో ఓ హోటల్‌లో ఉన్న ముత్యాల శ్రీదేవి తలపై చైన్ స్నాచర్ ఇనుప రాడ్‌తో దాడి చేసి ఆమె మెడలోని బంగారు గొలుసు లాక్కొని ఉడాయించాడు. ఘటనపై బాధివతురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన బీకేఎస్ సీఐ పుల్లయ్య, ఎస్‌ఐ రాంప్రసాద్ మంగళవారం తడకలేరు వద్ద వాహన తనిఖీలు చేపట్టిన సమయంలో అనుమానస్పదంగా కనిపించిన ఓ యువకుడిని అడ్డుకుని ప్రశ్నించారు. పొంతనలేని సమాధానాలు ఇవ్వడంతో పీఎస్‌కు తరలించి తమదైన శైలిలో ప్రశ్నించడంతో చైన్ స్నాచింగ్‌కు పాల్పడిన విషయం బహిర్గతమైంది. యువకుడిని ధర్మవరం మండలం వసంతపురం గ్రామానికి చెందిన చెడిపోతుల మహేష్‌గా గుర్తించారు. ప్రస్తుతం అనంతపురంలోని ఓబులదేవనగర్‌లో నివాసముంటున్నాడు. నాలుగు తులాల బంగారు గొలుసు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని నిందితుడిపై కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించారు.
ఎన్‌ఐసీ డీఐఓగా భారతి
అనంతపురం అర్బన్: కలెక్టరేట్ ఆవరణలోని జాతీయ సమాచార కేంద్రం (ఎన్‌ఐసీ) జిల్లా ఇన్ఫర్మేటిక్స్ అధికారిగా (డీఐఓ)గా టి.భారతి నియమితులయ్యారు. మంగళవారం ఎన్‌ఐసీలో ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ డీఐఓగా ఉన్న ఎం.రవిశంకర్ కర్ణాటక రాష్ట్రం బెంగళూరుకు బదిలీ అయ్యారు. దీంతో ఏడీఐఓగా ఉన్న భారతికి ఇన్‌చార్జ్ డీఐఓగా బాధ్యతలు అప్పగించారు. రవిశంకర్ చేతుల మీదుగా ఆమె బాధ్యతలను అందుకున్నారు.


