అనంతపురం అర్బన్: ఈ నెల 14, 15 తేదీల్లో రెండు రోజుల పాటు నిర్వహించనున్న గుత్తి కోట ఉత్సవాలకు ఏర్పాట్లు పటిష్టంగా ఉండాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశించారు. ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్లను సోమవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూభవన్‌లో జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్, ఇతర అధికారులతో కలిసి కలెక్టర్ ఆవిష్కరించి, మాట్లాడారు. కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యల పాల్గొనేలా చూడాలన్నారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ ఎ.మలోల, ఎఫ్‌ఎస్‌ఓ జి.రామకృష్ణారెడ్డి, పర్యాటక శాఖ అధికారి జయకుమార్‌బాబు, డిప్యూటీ కలెక్టర్లు ఆనంద్, రామ్మోహన్, మల్లికార్జునుడు, ఆర్‌డీఓ శ్రీనివాస్ పాల్గొన్నారు.
బాలికల ఆరోగ్య రక్షణకే హెచ్‌పీవీ టీకా
బాలికల ఆరోగ్య రక్షణకు హెచ్‌పీవీ టీకా ఎంతో కీలకమని కలెక్టర్ ఓ.ఆనంద్ అన్నారు. గర్భాశయ ముఖ క్యాన్సర్ నివారణకు దోహదపడే ఈ టీకాను 14 ఏళ్ల వయసున్న బాలికలకు తప్పనిసరిగా వేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. హెచ్‌పీవీ టీకాపై ప్రజలను చైతన్యపరుస్తూ ముద్రించిన పోస్టర్లను సోమవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూభవన్‌లో కలెక్టర్ ఆవిష్కరించి, మాట్లాడారు. ఈ నెల 11 నుంచి హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించాలన్నారు. 9వేల డోసుల టీకాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో జేసీ విష్ణుచరణ్, డీఆర్‌ఓ ఎ.మలోల, జీజీహెచ్ పరిపాలనాధికారి మల్లికార్జునరెడ్డి, ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓ శ్రీనివాసరెడ్డి, ఎన్‌టీఆర్ వైద్యసేవ జిల్లా కో–ఆర్డినేటర్ గంగాధర్‌రెడ్డి, డీఐఓ శశిభూషణ్‌రెడ్డి పాల్గొన్నారు.
పరిశ్రమల నిర్వాహకులకూ ‘ఉద్యమ్’ తప్పనిసరి
అనంతపురం టౌన్: ఇప్పటికే పరిశ్రమలు నిర్వహిస్తున్న వారు సైతం తప్పసరిగా ఉద్యమ్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని పరిశ్రమల శాఖ అసిస్టెండ్ డైరెక్టర్ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. ఉద్యమ్ రిజిస్ట్రేషన్‌పై సోమవారం అనంతపురం, గుత్తిలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుల్లో ఆయన మాట్లాడారు. ర్యాంప్ కార్యక్రమంలో భాగంగా పరిశ్రమలు నిర్వహిస్తున్న వారు ఉద్యమ్ రిజిస్ట్రేషన్ చేయించుకోవడం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రాయితీలు పొందేందుకు అర్హులవుతారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఐపీఓ రవీంధ్రనాథరెడ్డి, నిషాంత్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
14 నుంచి విద్యుత్ ఉద్యోగుల క్రీడా పోటీలు
అనంతపురం టౌన్: ఈ నెల 14 నుంచి 16వ తేదీ వరకూ విద్యుత్ ఉద్యోగుల క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆ శాఖ ఎస్‌ఈ శేషాద్రి శేఖర్ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. రెండు రోజుల పాటు జరిగే ఈ పోటీలకు ముఖ్య అతిథిగా ఏపీ ఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ లోతేటి హాజరు కానున్నారు. కబడ్డీ, వాలీబాల్, షటిల్, బాల్ బ్యాడ్మింటన్ తో పాటు వివిధ రకాల పోటీలు ఉంటాయి. ఆసక్తి ఉన్న ఉమ్మడి అనంతపురం జిల్లా పరిధిలోని విద్యుత్ శాఖ ఉద్యోగులు ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలి.
గుర్తుతెలియని వ్యక్తి మృతి
అనంతపురం సెంట్రల్: ఈ నెల 1న రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వృద్ధుడు మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు వెల్లడించారు. స్థానిక రుద్రంపేట సమీపంలోని 44వ జాతీయ రహదారి పక్కన ఉన్న పిస్తాహౌస్ వద్ద చోటు చేసుకున్న ప్రమాదంలో 65 ఏళ్ల వయసున్న వ్యక్తి గాయపడడంతో స్థానికులు గుర్తించి, అదే రోజు సర్వజనాస్పత్రిలో చేర్పించారు. సోమవారం పరిస్థితి విషమించడంతో ఆయన మృతిచెందాడు. సంబంధీకులు ఎవరైనా ఉంటే సంప్రదించాలని అనంతపురం ట్రాఫిక్ సీఐ వెంకటేష్ నాయక్ కోరారు.
బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
అనంతపురం: ఓ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు.. కళ్యాణదుర్గం మండలం దొడగట్ట గ్రామానికి చెందిన కృష్ణయ్య, శారదమ్మ దంపతుల కుమారుడు గొల్ల హరిప్రసాద్ (19).. అనంతలక్ష్మి ఇంజినీరింగ్ కళాశాలలోని హాస్టల్‌లో ఉంటూ బీటెక్ (ఈసీఈ) మొదటి సంవత్సరం చదువుకుంటున్నాడు. తల్లిదండ్రులు బెంగళూరుకు వలస వెళ్లి బేల్దారి పనులతో జీవనం సాగిస్తున్నారు. కారణాలేమిటో గానీ సోమవారం మధ్యాహ్నం హాస్టల్‌లోని తన గదిలో హరిప్రసాద్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న ఇటుకలపల్లి పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. తల్లిదండ్రులు ఇచ్చే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.


