అనంతపురం సెంట్రల్: కళ్యాణదుర్గంలో వెలుగుచూసిన ఈ– స్టాంప్ కుంభకోణంపై పోరాడుతున్న మాజీ ఎంపీ, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త తలారి రంగయ్యకు ప్రాణహాని ఉందని, ఆయనకు పోలీసు భద్రత కల్పించాలంటూ ఆ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. కళ్యాణదుర్గం కేంద్రంగా వెలుగు చూసిన ఈ – స్టాంప్ కుంభకోణంపై సమగ్ర విచారణ కోరుతూ హైకోర్టులో తలారి రంగయ్య పిల్ దాఖలు చేశారని గుర్తు చేశారు. ఈ కుంభకోణం వెనుక అధికార పార్టీకి చెందిన ముఖ్య నాయకుల ప్రమేయం ఉందని ఆరోపించారు. భారీ కుంభకోణానికి సంబంధించి ఆధారాలు బయట పెడుతుండడంతో ప్రత్యర్థుల నుంచి ఆయనకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో రంగయ్యకు 2 ప్లస్ 2 గన్‌మెన్ భద్రత కల్పించాలని పోలీసు అధికారులను కోరినట్లు వివరించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు దొడగట్ట నారాయణ, ములకనూరు తిమ్మరాయుడు, జిల్లా లీగల్ సెల్ ఉపాధ్యక్షుడు హనుమంతరెడ్డి, జెడ్పీటీసీ నాగరాజు, ఎంపీపీలు ఆంజనేయులు, భీమేష్, కన్వీనర్లు చంద్రశేఖరరెడ్డి, సూరి, హనుమంతరాయుడు, నాయకులు మురళి, రామాంజనేయులు యాదవ్, మల్లి, నారాయణస్వామి పాల్గొన్నారు.
ఈ – స్టాంప్ కుంభకోణంపై పోరాడుతుండడంతో ప్రాణహాని
ఎస్పీ కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ నాయకుల వినతి


