● నాలుగో ప్రయత్నంలో నెగ్గిన గిరిరాజ్ సాయికృష్ణ
తాడిపత్రిటౌన్: సివిల్ సర్వీసెస్ ఆయన కల. మూడు దఫాలు ఆశాభంగమే కలిగింది. అయినా వెనకడుగు వేయలేదు. మరింత ఏకాగ్రత పెంచి నాలుగోసారి విజయం సాధించారు. పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించారు తాడిపత్రికి చెందిన గిరిరాజ్ సాయికృష్ణ. తాజాగా విడుదలైన సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో 125వ ర్యాంకు సాధించారు. సాయిక్రిష్ణ తండ్రి ఉమా మహేశ్వరావు ఆటోమొబైల్ వర్క్‌షాపు నిర్వహిస్తుండగా.. తల్లి విజయలక్ష్మి గృహిణి. తాడిపత్రిలో శ్రీవాణి పాఠశాలలో ప్రాథమిక విద్య, హైదరాబాద్ నారాయణ కళాశాలలో ఇంటర్ పూర్తి చేశారు. రాజస్తాన్‌లోని బిట్స్ పిలానిలో ఇంజినీరింగ్ చేసి.. అనంతరం సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం సాధించారు. అలా ఐదేళ్లపాటు పనిచేశాక.. సివిల్స్ సాధించాలన్న లక్ష్యంతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. 2021లో తొలిసారి సివిల్స్ పరీక్ష రాశారు. 2022లో ఇంటర్వ్యూ వరకు చేరుకున్నారు. 2023లో గ్రూప్– 1 పరీక్షల్లో నెగ్గడంతో ఎంపీడీఓగా ఎంపికయ్యారు. ప్రస్తుతం నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల ఎంపీడీఓగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే 2024లో సివిల్స్ రాసినా రాణించలేకపోయారు. అయినా నిరాశ చెందకుండా ఎలాగైనా లక్ష్యాన్ని చేరుకోవాలని ఉద్యోగానికి సెలవు పెట్టి.. ఢిల్లీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీరుగా పని చేస్తున్న తన భార్య సుప్రియ వద్దకు వెళ్లారు. ఆమె సహకారం కూడా తోడవడంతో ఈసారి వెనుదిరిగి చూడలేదు. ఆత్మవిశ్వాసంతో పరీక్ష రాశారు. తాజాగా విడుదలైన సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో 125వ ర్యాంకు, తెలుగు రాష్ట్రాల్లో 5వ ర్యాంకు సాధించి తన కల నిజం చేసుకున్నారు. సాయికృష్ణ విజయంపై కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు హర్షం వ్యక్తం చేశారు.


