పొలంలోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు | - | Sakshi
Sakshi News home page

పొలంలోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు

Mar 8 2026 7:42 AM | Updated on Mar 8 2026 7:42 AM

మండుటెండలో తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట మహిళా రైతు నిరసన

యాడికి: తన పొలంలోకి వెళ్లకుండా రస్తాని కొందరు అడ్డుకుంటున్నారంటూ పెద్దపప్పూరు తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట బొందలదిన్నె గ్రామానికి చెందిన మహిళా రైతు జ్ఞానేశ్వరి శనివారం మండు టెండలోనే బైఠాయించి నిరసన వ్యక్తం చేసింది. ఈ సందరం్భంగా ఆమె మాట్లాడుతూ.. తమ పొలానికి వెళ్లడానికి పూర్వపు రస్తా ఉందని, ఇది రెవెన్యూ మ్యాప్‌లోనూ స్పష్టంగా పేర్కొన్నారని వివరించింది. అయితే కొంతకాలంగా అక్కడ రస్తా లేదంటూ కొందరు దౌర్జన్యానికి పాల్పడుతూ పొలంలో కాలు పెట్టకుండా తమను అడ్డుకుంటున్నారని వాపోయింది. ఈ విషయాన్ని కలెక్టర్‌ దృష్టికి కూడా తీసుకెళ్లామని, అయినా స్థానిక రెవెన్యూ అధికారులు మాత్రం సమస్యకు పరిష్కారం చూపకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించింది. పొలానికి రస్తా చూపించి న్యాయం చేయాలని, లేకపోతే తన భర్త ప్రతాపరెడ్డితో కలసి కలెక్టరేట్‌ ఎదుట దీక్ష చేపడతానని హెచ్చరించింది.

కట్టడంపై నుంచి జారిపడి కార్మికుడి మృతి

ఉరవకొండ రూరల్‌: నిర్మాణంలో ఉన్న ఓ భవనంపై నుంచి కింద పడి ఓ భవన నిర్మాణ కార్మికుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... ఉరవకొండకు చెందిన సలీం(30)కు భార్య యాస్మిన్‌, ఐదేళ్లలోపు వయసున్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఏడాదిగా తన భార్య పుట్టినిల్లైన ఆమిద్యాలలోనే నివాసముంటూ బేల్దారి పనులతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. శనివారం ఆమిద్యాలలో నిర్మాణంలో ఉన్న ఓ భవనానికి క్యూరింగ్‌ చేస్తూ రెండో అంతస్తుపై నుంచి అదుపు తప్పి కిందపడ్డాడు. గమనించిన స్థానికులు వెంటనే ఉరవకొండలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు ధ్రువీకరించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

రేపు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర స్థాయి బూత్‌ కమిటీ సమావేశం

అనంతపురం: తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయి బూత్‌ కమిటీల సమావేశాన్ని సోమవారం నిర్వహించనున్నారు. బూత్‌ కమిటీల రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల అధ్యక్షులు, రాష్ట్ర స్థాయి నాయకులు హాజరుకావాలని అనంతపురం జిల్లా బూత్‌ కమిటీల అధ్యక్షుడు వై.అమరనాథరెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బీఎల్‌ఓల నియామకం, స్పెషల్‌ ఇన్సెంటివ్‌ రివిజన్‌ అంశాలపై చర్చ ఉంటుందని పేర్కొన్నారు.

సూపర్‌ మార్కెట్‌లో చోరీ

కళ్యాణదుర్గం రూరల్‌: స్థానిక బళ్లారి మిట్టపై ఉన్న మెట్రో సూపర్‌ మార్కెట్‌లో చోరీ జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత తాళం బద్ధలుగొట్టి లోపలకు ప్రవేశించిన దుండగులు క్యాష్‌ కౌంటర్‌లోని రూ.30 వేలు అపహరించారు. యజమాని ఫిర్యాదు మేరకు శనివారం క్షేత్ర స్థాయిలో పోలీసులు పరిశీలించారు. సీసీ కెమెరా ఫుటేజీలను స్వాధీనం చేసుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ హరినాథ్‌ తెలిపారు.

టీడీపీ వర్గీయులపై

జనసేన నేతల దాడి

శింగనమల: మండలంలోని నాగులగుడ్డం తండాలో శనివారం సాయంత్రం టీడీపీ, జనసేన నాయకుల మధ్య పరస్పర దాడులు చోటు చేసుకున్నాయి. వారం రోజుల క్రితం గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణం విషయంలో టీడీపీ, జనసేన నాయకులు ఘర్షణ పడ్డారు. సమస్య సద్దుమణుగుతున్న సమయంలో శనివారం టీడీపీ నాయకుడు నాగభూషణంనాయక్‌ ఇంట్లోకి జనసేన నాయకులు దూసుకెళ్లి సామగ్రిని చెల్లాచెదురు చేశారు. తలుపులు పగులగొట్టారు. విషయం తెలుసుకున్న సీఐ కౌలుట్లయ్య వెంటనే శింగనమల, గార్లదిన్నెలు ఎస్‌ఐ విజయకుమార్‌, గౌస్‌, సిబ్బందితో అక్కడకు చేరుకుని ఇరువర్గాల వారిని చెదరగొట్టారు. కాగా, పరస్పర దాడిలో ఇరు వర్గాలకు చెందిన పలువురికి గాయాలయ్యాయి.

రేషన్‌ బియ్యం పట్టివేత

తాడిపత్రి టౌన్‌: స్థానిక శివాలయం సమీపంలో బైపాస్‌ రోడ్డుపై బొలెరో వాహనంలో 35 బస్తాల్లో తరలిస్తున్న 15.75 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని శనివారం సీఐ ఆరోహణరావు సీజ్‌ చేసారు. యాడికి మండలం కేశవరాయునిపేటకు చెందిన వాహన యజమాని గంగాధర్‌, డ్రైవర్‌ కంబన్నను అరెస్ట్‌ చేశారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని సీఎస్‌డీటీ మల్లేషుకు అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement