రైలు కిందకు దూసుకెళ్లిన గొర్రెలు | - | Sakshi
Sakshi News home page

రైలు కిందకు దూసుకెళ్లిన గొర్రెలు

Mar 8 2026 7:42 AM | Updated on Mar 8 2026 7:42 AM

30 జీవాల మృతి

డి హీరేహాళ్‌(రాయదుర్గం): రైలు కిందకు జీవాలు దూసుకెళ్లిన ఘటనలో 30 గొర్రెలు మృతి చెందాయి. డి.హీరేహాళ్‌ మండలం హొసగుడ్డం శివారున ఈ ఘటన చోటు చేసుకుంది. హొసగుడ్డం గ్రామానికి చెందిన చౌడిక ముక్కన తనకున్న 72 గొర్రెలను శనివారం మేపు కోసమని అటవీ ప్రాంతానికి తోలుకెళ్లాడు. మార్గమధ్యంలో రైలు పట్టాల పక్కన మేస్తున్న గొర్రెల్లో ఓ గొర్రె అప్పటికే శరవేగంగా వచ్చిన ఎక్స్‌ప్రెస్‌ రైలు నుంచి త్రుటిలో ప్రమాదాన్ని తప్పించుకుంటూ అవతలి వైపుగా వెళ్లింది. దానిని అనుసరిస్తూ మిగిలిన గొర్రెలు కూడా రైలు కిందకు దూసుకెళుతూ ఒకదాని వెనుక ఒకటి చొప్పున 30 జీవాలు మృతి చెందాయి. ఐదు గొర్రెలు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఆ సమయంలో కాపరి ఎంత అడ్డుకున్నా సాధ్యం కాలేదు. వాటిని కాపాడబోయిన ఇద్దరు కాపర్లు ప్రాణపాయం నుంచి తప్పించుకున్నారు. ఘటనతో రూ.3 లక్షలకు పైగా నష్టం వాటిల్లిందని బాధిత రైతు కన్నీటి పర్యంతమయ్యాడు.

ద్విచక్ర వాహనాల ఢీ – ఒకరి మృతి

శింగనమల: ద్విచక్ర వాహనాలు పరస్పరం ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. శింగనమల మండలం జూలకాల్వ గ్రామానికి చెందిన తలారి బయ్యన్న (57) శనివారం వ్యక్తిగత పనిపై నాయనపల్లి క్రాస్‌కు వచ్చాడు. సాయంత్రం పని ముగించుకుని ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి తిరుగు ప్రయాణమైన ఆయన జలాలపురం వద్దకు చేరుకోగానే ఎదురుగా ద్విచక్ర వాహనంపై శరవేగంగా దూసుకొచ్చిన జూలకాల్వకు చెందిన అశోక్‌ ఢీకొన్నాడు. ప్రమాదంలో తలారి బయ్యన్న ఎగిరి రోడ్డు పక్కన ఉన్న కంపచెట్లలో పడ్డాడు. అటుగా పోతున్న వారు గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడకు చేరుకుని వెంటనే అనంతపురంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ బయ్యన్న మృతి చెందాడు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

సౌరవిద్యుత్‌ పనులు వేగవంతం చేయాలి

శింగనమల: సౌర విద్యుత్‌ ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని కలెక్టర్‌ ఆనంద్‌ ఆదేశించారు. శనివారం ఆయన శింగనమల నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు. శింగనమల మండలం పెరవలిలో పీఎం కుసుమ్‌ పథకం కింద ఏర్పాటు చేస్తున్న 4 మెగావాట్ల సౌర విద్యుత్‌ ప్రాజెక్టు పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడి రైతులు, మేఘా ఇంజినీరింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ప్రతినిధులతో సమావేశమయ్యారు. సౌరవిద్యుత్‌ ప్రాజెక్టులో భాగంగా జిల్లాలోని 20 సబ్‌ స్టేషన్లలో జరుగుతున్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అనంతరం నాయనపల్లి క్రాస్‌ వద్ద పీఎం సూర్య ఘర్‌ లబ్ధిదారుల ఇళ్లను పరిశీలించారు. అలాగే బుక్కరాయసముద్రం మండలం పసలూరులో ఆర్డీ్‌ఎస్‌ఎస్‌ పనులను కలెక్టర్‌ పరిశీలించి మాట్లాడారు. విద్యుత్‌ స్తంభాలు, డీటీఆర్‌లను ఏర్పాటు చేసే సమయంలో ఏపీఎస్పీడీసీఎల్‌ అధికారులకు సహకరించాలన్నారు. అంతకుముందు రేకులకుంటలో అంగన్‌వాడీ కేంద్రం, ప్రైమరీ స్కూల్‌, మండల పరిషత్‌ ప్రాథఽమిక పాఠశాలను తనిఖీ చేశారు. అంగన్‌వాడీ కేంద్రంలో వయస్సుకు తగ్గ ఎత్తు, బరువు పిల్లలు ఉన్నారా లేదా అని పరిశీలించారు. పౌష్టికాహారంతో కూడిన భోజనం అందించాలన్నారు. కార్యక్రమంలో ఏపీఎస్పీడీసీఎల్‌ సూపరింటెండింగ్‌ ఇంజినీర్‌ శేషాద్రి శేఖర్‌, ఈఈ జేవీ రమేష్‌, డీఈ రఘు, శ్రీకాంత్‌రెడ్డి, ఏఈ మహబూబ్‌ బాషా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement