● చక్రం తిప్పిన మున్సిపల్ రెవెన్యూ అధికారులు
గుంతకల్లుటౌన్: స్థానిక మున్సిపాలిటీ ఆదాయ వనరులపై శనివారం నిర్వహించిన వేలం ప్రక్రియ ఏకపక్షంగా సాగింది. ఏటా కౌన్సిల్ హాల్‌లో అందరి సమక్షంలో వేలం పాటను నిర్వహించే అధికారులు మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవి చాంబర్‌లో ఈ ప్రక్రియను ముగించారు. టీడీపీ ప్రజాప్రతినిధుల ఆదేశాల మేరకు టీడీపీ మద్దతుదారుడికే అధికారులు నాలుగు కాంట్రాక్ట్‌లను కట్టబెట్టడం వివాదాస్పదమైంది. ఉదయం 11 గంటలకు వేలంపాటను నిర్వహిస్తామంటూ రెండు రోజుల ముందు ప్రకటించిన అధికారులు నిర్ణీత సమయం కంటే ముందే ఈ ప్రక్రియను ముగించేయడం అనుమానాలకు తావిచ్చింది. దీంతో అధికారులను కాంట్రాక్టర్లు హుస్సేన్ సాహెబ్, నాసీర్, రామాంజనేయులు నిలదీశారు. ఇష్టం వచ్చినట్లు వేలంపాటను ఎలా నిర్వహిస్తారని మున్సిపల్ ఆర్‌ఐ ఎర్రిస్వామి, సీకే రామాంజనేయులను వారు ప్రశ్నించారు. కార్యాలయంలోనే ఉన్న తమకు కనీస సమాచారం కూడా ఎందుకు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గుట్టుగా వేలం ప్రక్రియ
మున్సిపల్ కమిషనర్ చాంబర్‌లో జరిగిన వేలం పాటలో ఒకే వర్గానికి చెందిన కేవలం నలుగురు కాంట్రాక్టర్లు మాత్రమే పాల్గొన్నారు. వీరిలో పత్తిపాటి చంద్రశేఖర్ నాయుడుకు నాలుగు కాంట్రాక్టులు దక్కాయి. రూ.46.18 లక్షలతో దినసరి పబ్లిక్ మార్కెట్‌లో సుంకం వసూలు చేసుకునే హక్కు, రూ.3.23 లక్షలతో మాంసపు9 విక్రయాల సుంకం వసూలు హక్కు, రూ. 2.04 లక్షలతో పశు వధుశాల, విక్రయాలపై సుంకం వసూలు హక్కు, రూ.2.20 లక్షలతో జీవాల వధశాల, మాంసం విక్రయాలపై సుంకం వసూలు హక్కును పొందాడు. అధికారులు ఏకపక్షంగా కాకుండా కాంట్రాక్టర్లందరి సమక్షంలో వేలం పాట నిర్వహించి ఉంటే పోటీ పెరిగి మున్సిపాలిటీకి ఆదాయం మరింత పెరిగేదని పలువురు పేర్కొన్నారు. ఈ మొత్తం అక్రమాలను తెర వెనుక నుంచి మున్సిపల్ రెవెన్యూ అధికారులు ఇద్దరు తిప్పినట్లుగా ఆరోపణలు వ్యక్తమయ్యాయి. కలెక్టర్ చొరవ తీసుకుని వేలం ప్రక్రియను రద్దు చేసి, మళ్లీ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.


