● వీసీ ప్రొఫెసర్ సుదర్శనరావు
అనంతపురం: ఎందరో శాస్త్రవేత్తలు, ఇంజినీరింగ్ నిపుణులను ప్రపంచానికి అందించిన ఖ్యాతి జేఎన్‌టీయూ(ఏ) సొంతమని, నాణ్యమైన విద్యను అందిస్తూ జాతీయ స్థాయి గుర్తింపుతో అగ్రగామిగా నిలిచిందని ఆ వర్సిటీ వీసీ ప్రొఫెసర్ హెచ్.సుదర్శనరావు అన్నారు. జేఎన్‌టీయూ (ఏ) ఇంజినీరింగ్ కళాశాల ఏర్పడి 80 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వార్షికోత్సవాలను అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. క్యాంపస్ కళాశాల ప్రిన్సిపాల్ పి.చెన్నారెడ్డి అధ్యక్షతన శనివారం ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమాలకు విద్యార్థులు భారీగా హాజరయ్యారు.ఆద్యంతం కన్నుల పండుగగా కార్యక్రమాలు జరిగాయి. అంతకు ముందు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాలను వీసీ ప్రారంభించి, మాట్లాడారు. కళాశాల పూర్వ విద్యార్థులు అత్యున్నత స్థాయిలో ఉన్నారని చెప్పడానికి గర్వంగా ఉందన్నారు. కళాశాల పురోభివృద్ధిలో పూర్వ విద్యార్థుల సహకారాన్ని కొనియాడారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కృష్ణయ్య, ఓఎస్డీటూవీసీ ఓ.దేవన్న, స్పోర్ట్స్ సెక్రెటరీ డాక్టర్ టి.నారాయణరెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ దిలీప్‌కుమార్, ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ జోజిరెడ్డి , విద్యార్థుల తరపున కో–ఆర్డినేటర్లు యు.సాయిహేమంత్, కె.అనురాగ్ శ్యాం, డి.సాయి విష్ణు, కె.రోహిత్ పాల్గొన్నారు. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి వీసీ చేతుల మీదుగా మెరిట్ సర్టిఫికెట్లు అందజేశారు.


