జ్యోతిర్లింగాల దర్శనం కోసం సైకిల్‌ యాత్ర | - | Sakshi
Sakshi News home page

జ్యోతిర్లింగాల దర్శనం కోసం సైకిల్‌ యాత్ర

Mar 7 2026 8:08 AM | Updated on Mar 7 2026 8:08 AM

ఉరవకొండ రూరల్‌: చత్తీస్‌ఘడ్‌లోని రాయ్‌పూర్‌కు చెందిన యువకుడు వినయ్‌ దేశంలోని 12 జ్యోతిర్లింగాల దర్శనం కోసం సైకిల్‌ యాత్ర చేపట్టాడు. గత ఏడాది ఏప్రిల్‌ 15న చేపట్టిన ఈ యాత్ర శుక్రవారం చిన్నముష్టూరు సమీపంలోకి చేరుకుంది. ఈ సందర్భంగా ‘సాక్షి’ ఆయనను పలకరించింది. ఇప్పటి వరకూ 10 జ్యోతిర్లింగాల దర్శనం పూర్తి చేసినట్లు వినయ్‌ వివరించాడు. ప్రస్తుతం రామేశ్వరం వెళుతున్నానని పేర్కొన్నాడు. మార్గ మధ్యంలోని ఆలయాల్లో పెట్టే అన్న దానం, ప్రజలు ఇచ్చే ఆహారంతో యాత్ర సాగిస్తున్నట్లు తెలిపాడు.

మత్స్యశాఖ అసిస్టెంట్‌కు మెమో జారీ

కూడేరు: పింఛన్ల పంపిణీలో అక్రమాలకు తెరలేపిన కూడేరు మండలం కొర్రకోడు సచివాలయ మత్స్య శాఖ అసిస్టెంట్‌ విజయ్‌కుమార్‌కు అధికారులు మెమో జారీ చేశారు. సామాజిక భధ్రతా పింఛన్ల పంపిణీ విషయంలో పలువురు లబ్ధిదారులతో వేలిముద్రలు తీసుకుని నగదు ఇవ్వలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ అంశంపై ‘పింఛన్ల పంపిణీలో చేతివాటం’ శీర్షికతో గురువారం ‘సాక్షి’లో వెలువడిన కథనంపై ఎంపీడీఓ కుళ్లాయిస్వామి స్పందించారు. ఇందుకు సంబంధించిన సమగ్ర వివరణను రాతపూర్వకంగా ఇవ్వాలని, లేనిపక్షంలో శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా, విజయకుమార్‌ ఇచ్చే వివరణ ఆధారంగా క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి తదుపరి చర్యల నిమిత్తం మత్స్యశాఖ ఉన్నతాధికారులకు సిఫారసు చేయనున్నట్లు ఎంపీడీఓ తెలిపారు.

లక్ష్యానికి మించి ‘డ్రిప్‌’

ఏపీఎంఐపీ పీడీ రఘునాథరెడ్డి

అనంతపురం అగ్రికల్చర్‌: ఈ ఏడాది లక్ష్యానికి మించి డ్రిప్‌, స్ప్రింక్లర్లు పంపిణీ చేసినట్లు ఏపీఎంఐపీ పీడీ బి.రఘునాథరెడ్డి, ఏపీడీ బీసీ ధనుంజయ తెలిపారు. డ్రిప్‌ పంపిణీలో రాష్ట్రంలోనే అనంతపురం జిల్లా మొదటి స్థానంలో ఉందని తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 18 వేల హెక్టార్లకు రాయితీతో పరికరాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా, ఇప్పటికే 21 వేల హెక్టార్లకు పైబడి ఇచ్చారు. ఈ సంఖ్య నెలాఖరు నాటికి 22 వేల హెక్టార్లకు చేరుకోనుంది. 17 వేల మంది రైతులు లబ్ధి పొందారు. ఏప్రిల్‌ నుంచి ప్రారంభం కానున్న 2026–27 ఆర్థిక సంవత్సరానికి గాను 19,500 హెక్టార్లకు డ్రిప్‌ అనుమతులు కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ప్రస్తుతం డ్రిప్‌, స్ప్రింక్లర్లతో పాటు కొత్తగా ఆటోమేషన్‌ పరికరం పంపిణీపై దృష్టి సారించారు. రూ.40 వేలు విలువ చేసే ఈ పరికరంపై 5 ఎకరాల్లోపు ఉన్న చిన్న సన్నకారు రైతులకు 55 శాతం, మిగిలిన రైతులకు 45 శాతం రాయితీ ఉంటుంది.

ఆటో బోల్తా –

నలుగురికి గాయాలు

కళ్యాణదుర్గం రూరల్‌(కంబదూరు): ఆటో బోల్తాపడిన ఘటనలో నలుగురు ప్రయాణికులు గాయపడ్డారు. మండల కేంద్రం కంబదూరులోని చెరువు కట్ట వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. అనంతపురానికి చెందిన పలువురు తమ బంధువుల ఇంటికని ఆటోలో వస్తుండగా చెరువు కట్ట వద్దకు చేరుకోగానే డ్రైవర్‌ నియంత్రణ కోల్పోవడంతో రోడ్డు పక్కన ఉన్న పంట పొలాల్లోకి ఆటో దూసుకెళ్లి బోల్తాపడింది. ఆటోలో ప్రయాణిస్తున్న రాజు, ఉమాపతి, రాఘవేంద్ర, లక్ష్మీదేవి గాయపడ్డారు. అటుగా వెళుతున్న వారు గుర్తించి క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో కళ్యాణదుర్గంలోని సీహెచ్‌సీకి తరలించారు. ఘటనపై కంబదూరు పోలీసులు విచారణ చేపట్టారు.

10 ఎకరాల్లోని

మామిడి తోట దగ్ధం

హిందూపురం: గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు రాజేయడంతో దాదాపు 10 ఎకరాల్లోని మామిడి తోట దగ్ధమైంది. బాధితులు తెలిపిన మేరకు.. హిందూపురం మండలం బాలంపల్లి గ్రామానికి చెందిన మహిళా రైతు నారాయణమ్మకు చలివెందుల గ్రామ రెవెన్యూ పరిధిలో 10 ఎకరాల మామిడి తోట ఉంది. సీజన్‌ మొదలు కావడంతో పంట ఆశాజనకంగా ఉంది. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తోటకు సమీపంలోని ఎండు గడ్డికి నిప్పు రాజేశారు. దీంతో మంటల చెలరేగి తోటను చుట్టుముట్టాయి. మూడు ఎకరాల్లోని మామిడి చెట్టన్నీ కాలిపోయాయి. మిగిలిన చెట్లు పాక్షికంగా మాడిపోయాయి. ఘటనతో రూ.5 లక్షల మేర నష్టం వాటిల్లిందని, పంట కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలంటూ బాధిత మహిళా రైతు కన్నీటి పర్యమైంది. తమను ప్రభుత్వం ఆదుకోవాలంటూ విజ్ఞప్తి చేసింది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వివరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement