● మాజీ ఎంపీ తలారి రంగయ్య
కళ్యాణదుర్గం రూరల్: ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏను రెన్యువల్ చేయాలనే డిమాండ్‌తో తలపెట్టిన లక్ష పోస్టు కార్డుల ఉద్యమాన్ని జయప్రతం చేయాలని ప్రజలకు కళ్యాణదుర్గం వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త, మాజీ ఎంపీ తలారి రంగయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం కళ్యాణదుర్గంలోని పార్టీ కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ నేతలతో కలిసి పోస్టు కార్డులను ఆయన ప్రదర్శించి మాట్లాడారు. పాలకులు, ప్రభుత్వాలు చేయలేని సంక్షేమ పనులను ఆర్డీటీ ఎంతో సమర్థవంతంగా చేస్తూ వస్తోందన్నారు. అలాంటి సంస్థ ఏఫ్‌సీఆర్‌ఏను రెన్యువల్ చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. ఆర్డీటీ పరిరక్షణకు ఈ నెల 10న కుందుర్పిలోని ఫెర్రర్ ఆలయం నుంచి లక్ష పోస్టు కార్డుల ఉద్యమాన్ని అధికారికంగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రాజకీయాలకు అతీతంగా అందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
మోదీ దిగివచ్చే దాకా ఉద్యమం
కుందుర్పి: కరువు జిల్లా జీవనాడిగా ఉన్న ఆర్డీటీ పరిరక్షణ అంశంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దిగి వచ్చే వరకూ ఉద్యమాన్ని కొనసాగిస్తామని తలారి రంగయ్య స్పష్టం చేశారు. ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ పునరుద్దరించాలనే డిమాండ్‌తో ఈ నెల 10న కుందుర్పి నుంచి తలపెట్టిన పోస్టు కార్డుల ఉద్యమంపై స్థానిక ఫెర్రర్ ఆలయంలో పార్టీ నేతలు, స్థానికులతో ఆయన సమావేశమై చర్చించారు. జిల్లాకు ఆర్డీటీ ఆవశ్యకతను వివరించారు.ఎక్కడేగాని లేని విధంగా ఇక్కడ రూ.6 కోట్లతో ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్‌కు ఆలయాన్ని నిర్మించి, కులమతాలకు అతీతంగా పూజలు, ప్రార్థనలు చేస్తున్నారంటే ఆర్డీటీ సేవలు ఎంత గొప్పగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చునన్నారు. ఈ ఆలయం వద్దనే లక్ష పోస్టుకార్డుల ఉద్యమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి తరలివచ్చే ప్రజలు ఎలాంటి అసౌకర్యాలకు గురి కాకుండా వసతులు కల్పించాలని స్థానిక నేతలకు సూచించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులతో పాటు కుందుర్పి, కంబదూరు మండలాలకు చెందిన ఆలయ కమిటీ సభ్యులు, వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన ఆర్డీటీ లబ్ధిదారులు పాల్గొన్నారు.


