● శ్మశానంలో ‘పచ్చ’ నేతల బరితెగింపు
విడపనకల్లు: అక్రమార్జన కోసం ‘పచ్చ’ నేతలు బరితెగించారు. అనుమతి లేకుండా ఎడాపెడా మట్టి దోపిడీకి తెగబడుతున్నారు. ఈ క్రమంలో మరింత బరితెగించి శ్మశానంలోకి ప్రవేశించి యథేచ్ఛగా మట్టి తవ్వకాలు చేపట్టి సొమ్ము చేసుకున్నారు. చీకలగురికి గ్రామంలో జరిగిన ఈ ఘటనపై ప్రజల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల బూదగవి క్రాస్ నుంచి చీకలగురికి రూ.1.50 కోట్లతో బీటీ రోడ్డు నిర్మించారు. రోడ్డు కోసం అవసరమైన మట్టిని చౌకగా తీసుకుని కాసులు మిగుల్చుకోవడం కోసం కాంట్రాక్టర్ స్థానిక టీడీపీ నేతల సహకారం తీసుకున్నాడు. ఇంకేముంది టీడీపీ నేతలు గ్రామ సమీపంలోని చెరువు వద్ద మట్టి తవ్వకాలు చేపడుతూ క్రమేణా శ్మశానం లోకి అడుగు పెట్టారు. సమాధులను పెకలిస్తూ 20 అడుగుల మేర లోతు వరకు మట్టి తవ్వకాలు చేపట్టారు. శ్మశానంలో ఎక్కడ పడితే అక్కడ పెద్ద పెద్ద గోతులు దర్శనమిస్తున్నాయి. వర్షా కాలంలో ఈ గోతులు నీటితో నిండిపోనున్నాయి. అక్కడ శవాలను పాతిపెట్టే సమయంలో ప్రమాదాల బారినపడే పరిస్థితులు కనిపిస్తుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డబ్బు కోసం టీడీపీ నేతలు – కాంట్రాక్టర్ కలిసి శ్మశానానిన్న తవ్వేసినా రెవెన్యూ అధికారులు కానీ, పోలీసులు కానీ, మైనింగ్ అధికారులు కానీ తమకేమీ పట్టనట్టు ఉండటంపై మండిపడుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట వేసి.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
చీకలగురికిలో శ్మశానం వద్ద మట్టిని తవ్వేయడంతో ఏర్పడిన గుంతలు


