పగిలిన శ్రీరామరెడ్డి పైప్‌లైన్‌ | - | Sakshi
Sakshi News home page

పగిలిన శ్రీరామరెడ్డి పైప్‌లైన్‌

Mar 6 2026 8:22 AM | Updated on Mar 6 2026 8:22 AM

బ్రహ్మసముద్రం : మండలంలోని నాగిరెడ్డిపల్లి అటవీ ప్రాంతంలో గురువారం శ్రీరామరెడ్డి తాగునీటి పథకానికి సంబంధించిన పైప్‌లైన్‌ ఎయిర్‌ వాల్‌ పగిలిపోయింది. దీంతో నీరు ఉవ్వెత్తున ఎగిసి పడుతోంది. ఘటనతో నాగిరెడ్డిపల్లి, ఆపై గ్రామాలకు తాగునీరు అందకుండా పోయింది. అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు చొరవ తీసుకుని పైప్‌లైన్‌ పటిష్టతకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

సైన్స్‌ సమగ్ర మహోత్సవ్‌లో విద్యార్థుల ప్రతిభ

రాయదుర్గం టౌన్‌: సైన్స్‌ సిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌, సమగ్ర శిక్ష సంయుక్తంగా నిర్వహించిన సైన్స్‌ సమగ్ర మహోత్సవ్‌–2026లో రాయదుర్గంలోని కళ్లీమఠం మున్సిపల్‌ హైస్కూల్‌ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. గత నెల 27న విజయవాడ వేదికగా సాగిన ఈ వేడుకలో బేబీ బోర్‌వెల్‌ రెస్క్యూ మిషన్‌ ప్రాజెక్ట్‌ను పాఠశాల విద్యార్థులు రామాంజనేయులు, బాలాజీ ప్రదర్శనకు రాష్ట్ర స్థాయిలో రెండో స్థానం దక్కింది. అంతేకాక ఏసియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లోనూ చోటు దక్కింది. ప్రతిభ చాటిన విద్యార్థులను గురువారం పాఠశాలలో హెచ్‌ఎం తాజున్బీ, ఉపాధ్యాయులు, ఎంఈఓలు మహమ్మద్‌ ఇర్షాద్‌, వెంకటరమేష్‌ ఘనంగా సత్కరించారు. దాత కాలవ భరత్‌ చేత రూ.10 వేలు నగదు పురస్కారాన్ని అందజేయించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

కాలువలోకి దూసుకెళ్లిన కారు

కళ్యాణదుర్గం రూరల్‌: స్థానిక మున్సిపాలిటి పరిధిలోని ఒంటిమిద్ది గ్రామం వద్ద నిర్మాణంలో ఉన్న బీటీపీ కాలువలోకి గురువారం తెల్లవారుజామున కారు దూసుకెళ్లింది. వివరాల్లోకి వెళితే.. తాడిపత్రి పట్టణానికి చెందిన ఎర్రిస్వామి, రాహుల్‌, పవన్‌ వ్యక్తిగత పనిపై చిత్రదుర్గం వెళ్లి గురువారం తిరుగు ప్రయాణమయ్యారు. ఒంటిమిద్ది గ్రామం వద్దకు చేరుకోగానే డ్రైవర్‌ నియంత్రణ కోల్పోవడంతో కారు కాలువలోకి దూసుకెళ్లింది. ఘటనలో కారులో ఉన్న ముగ్గురూ గాయపడ్డారు. అటుగా వెళుతున్న వారు గుర్తించి క్షతగాత్రులను ఆస్పత్రికి చేర్చారు. మెరుగైన చికిత్స కోసం రాహుల్‌, ఎర్రిస్వామిని అనంతపురానికి వైద్యులు రెఫర్‌ చేశారు. ఘటనపై పోలీసులు ఆరా తీశారు.

వ్యక్తి ఆత్మహత్య

యాడికి: వ్యాధి నయం కాకపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిసిన మేరకు.. యాడికి లోని కోట వీధిలో నివాసముంటున్న ఓగేటి నాగరాజు(60) షుగర్‌ వ్యాధితో బాధపడుతున్నాడు. మూడేళ్ల క్రితం ఎడమ కాలిలోని రెండు వేళ్లను వైద్యులు తొలగించారు. వారం రోజులుగా వ్యాధి తీవ్రత ఎక్కువ అవుతుండడంతో జీవితంపై విరక్తి చెందిన ఆయన బుదవారం రాత్రి ఎలుకల మందు తాగాడు. గమనించిన బార్య హైమావతి వెంటనే బందువుల సాయంతో అనంతపురంలోని వైద్యశాలకు తీసుకెళ్లారు. అక్కడ చికిత్సకు స్పందించక గురువారం ఆయన మృతి చెందాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

హోరాహోరీగా వృషభాల బలప్రదర్శన

యాడికి: మండల కేంద్రంలో వెలసిన లక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి బండ లాగుడు పోటీలు హోరాహోరీగా సాగాయి. పోటీలకు 14 జతల వృషభాలను రైతులు తీసుకువచ్చారు. వైఎస్సార్‌ కడప జిల్లా పోరుమామిళ్లకు చెందిన రైతు శివకృష్ణ వృషభాలు 1831.09 అడుగులు దూరం లాగి ప్రథమ స్థానంలో నిలిచాయి. రెండో స్థానంలో నంద్యాల జిల్లా పెద్దకొట్టాల గ్రామ రైతు కేశవరెడ్డి వృషభాలు, మూడో స్థానంలో వైఎస్సార్‌ కడప జిల్లా చౌటుపల్లి గ్రామ రైతు ఓబులరెడ్డి వృషభాలు, నాల్గో స్థానంలో నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం పీఆర్‌ పల్లికి చెందిన రైతు నాగయ్య వృషభాలు, ఐదో స్థానంలో పెద్దవడుగూరు మండలం మేడిమాకులపల్లికి చెందిన రైతు రామసుబ్బారెడ్డి వృషభాలు నిలిచాయి. విజేత వృషభాల యజమానులను నగదు పురస్కారాలతో నిర్వాహకులు సత్కరించారు. కార్యక్రమంలో చవ్వా గోపాలరెడ్డి, జూటూరు అబ్దుల్‌ రజాక్‌, ఉమ్మడిపాల ప్రభాకరరెడ్డి, అబ్దుల్‌ రెహమాన్‌, వెంగన్నపల్లి సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement