పరిహారం చెల్లించి పనులు చేయండి | - | Sakshi
Sakshi News home page

పరిహారం చెల్లించి పనులు చేయండి

Mar 6 2026 8:22 AM | Updated on Mar 6 2026 8:22 AM

గుత్తి రూరల్‌: తమ భూమలకు పరిహారం చెల్లించిన తర్వాతనే పనులు చేపట్టాలంటూ రెన్యూ సోలార్‌ ప్లాంట్‌ అధికారులతో గురువారం బాధిత రైతులు వాగ్వాదానికి దిగారు. గుత్తి మండలం ఊటకల్లులో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామ శివారులోని తమ పొలాల మీదుగా వెళ్తున్న హైటెన్షన్‌ విద్యుత్‌ తీగలకు సంబంధించి ఏర్పాటు చేస్తున్న టవర్ల పనులను రైతులు అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న రెన్యూ సోలార్‌ప్లాంట్‌ అధికారులు అక్కడకు చేరుకుని రైతులతో చర్చించారు. కర్నూలు, నంద్యాల జిల్లాలో రైతులకు పరిహారం ఇస్తామని నమ్మబలికి పనులు పూర్తి చేసి నేటికీ పట్టించుకోలేదని రైతులు మండిపడ్డారు. తమకు పరిహారం చెల్లించి పనులు చేపట్టాలని, లేదా చెల్లిస్తామంటూ లిఖిత పూర్వకంగా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సమాచారం అందుకున్న సీఐ రామారావు, ఎస్‌ఐ సురేష్‌, సిబ్బంది అక్కడకు చేరుకుని రైతులు, సోలార్‌ ప్లాంట్‌ అధికారులతో మాట్లాడారు. సామరస్యంగా మాట్లాడుకుని పరిహారం పొందాలని రైతులకు సీఐ రామారావు సూచించారు. అయినా రైతులు వెనక్కు తగ్గలేదు. ఎంత పరిహారం ఇస్తారో చెప్పి అందుకు సంబంధించి లిఖిత పూర్వకంగా ఇచ్చిన తర్వాతనే పనులు చేపట్టాలన్నారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్‌ పుణ్యవతి సైతం అక్కడకు చేరుకుని రైతులకు సర్ధి చెప్పేందుకు ప్రయత్నించారు. పరిహారం తక్కువ ఇస్తున్నట్లు అభ్యంతరాలు ఇస్తే కలెక్టర్‌కు పంపుతానని, అప్పటి వరకూ పనులు అడ్డుకోరాదని అన్నారు. అయితే రైతులు తమకు నమ్మకం లేదని, కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి ఇప్పుడే పరిహారం విషయం తేల్చాలని ఆందోళన చేపట్టారు.

విద్యుత్‌ టవర్‌ ఎక్కిన రైతు

సోలార్‌ ప్లాంట్‌ అధికారులతో

రైతుల వాగ్వాదం

సోలార్‌ ప్లాంట్‌ నిర్వాహకులు రైతులను మోసం చేస్తున్నారంటూ నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం యల్లమ్మగుట్ట తండా గ్రామానికి చెందిన రైతు బాబూ నాయక్‌ విద్యుత్‌ టవర్‌ ఎక్కి నిరసన తెలిపాడు. రైతులకు న్యాయం చేసే వరకూ టవర్‌ దిగేది లేదని పైనే ఉండిపోయాడు. పనులు మొదలు పెట్టే సమయంలో ఒక మాట చెప్పి, పనులు పూర్తయ్యాక నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని, ఈ విషయంగా రైతులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. దీంతో న్యాయం చేస్తామని రెవెన్యూ అధికారులు, పోలీసులు సర్ది చెప్పి కిందకు దింపారు. అనంతరం కర్నూలు, నంద్యాల జిల్లాల రైతులు అక్కడకు చేరుకుని పెద్ద ఎత్తున నిరసన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement