అనంతపురం ఎడ్యుకేషన్: సబ్జెక్ట్ సీనియార్టీ జాబితాలో పీఎస్ హెచ్‌ఎం (స్కూల్ అసిస్టెంట్లు) పేర్లను చేర్చాలని పీఎస్ హెచ్‌ఎం అసోసియేషన్ నాయకులు కోరారు. ఈ మేరకు గురువారం డీఈఓ ఎం.ప్రసాద్‌బాబును అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణరెడ్డి, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు పి.రంగారెడ్డి కలిసి వినతిపత్రం అందజేసి, మాట్లాడారు. 2025 బదిలీల్లో భాగంగా రేషనలైజేషన్ ప్రక్రియలో దాదాపు 530 మంది స్కూల్ అసిస్టెంట్ల ఖాళీలు లేవని పీఎస్ హెచ్‌ఎం/ఎస్‌ఏ డిజిగ్నేషన్‌తో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలకు బదిలీ చేశారన్నారు. ఈ నేపథ్యంలో 2026 బదిలీల కంటే ముందే జీరో సర్వీస్‌తో విల్లింగ్ ఉన్న పీఎస్ హెచ్‌ఎం/ఎస్‌ఏలను వారివారి సబ్జెక్ట్ స్కూల్ అసిస్టెంట్లను తిరిగి ఉన్నత పాఠశాలలకు పంపాలని కోరారు. వీరిని స్కూల్ అసిస్టెంట్ సీనియారిటీ జాబితాలో పొందుపరచాలన్నారు. పీఎ్‌స్‌హెచ్‌ఎంలకు జాబ్‌చార్ట్ ఇవ్వాలన్నారు. డీఈఓను కలిసిన వారిలో నాయకులు సర్దానప్ప, శివశంకర్ రెడ్డి, జగదీష్ ఉన్నారు.
పెండింగ్ ‘ఎల్‌ఆర్‌ఎస్’ను పరిష్కరించండి
● అహుడా వైస్ చైర్మన్ విష్ణుచరణ్
అనంతపురం క్రైం: అహుడా (అనంతపురం–హిందూపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) పరిధిలో అపరిష్కృతంగా ఉన్న ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను అహుడా వైస్ చైర్మన్ సి.విష్ణుచరణ్ అదేశించారు. ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల అంశంపై సంబంధిత అధికారులతో గురువారం అనంతపురంలోని అహుడా కార్యాలయంలో అహుడా చైర్మన్ టి.సి.వరుణ్, సెక్రటరీ జి.రామకృష్ణారెడ్డితో కలిసి సంబంధిత అధికారులతో ఆయన సమీక్షించారు. అనధికార లే అవుట్లు, ప్లాట్ల నియంత్రణ పథకం కింద వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించి పరిష్కరించాలన్నారు. అనుమతి లేకుండా ప్లాట్లు వేసినా, విక్రయించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కందుకూరు, కుణుతూరు లేఅవుట్లలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలన్నారు. అనంతరం నిర్వహించిన గ్రీవెన్స్‌లో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. కార్యక్రమంలో అహుడా పీఓ ఇషాక్, ఇంజినీర్ దుష్యంత్, ఈఓ అరుణకుమారి, ఏఓ రవిచంద్రన్, పబ్లిక్ హెల్త్ ఆఫీసర్, జేపీఓ హరీష్‌చౌదరి, డీఈ రేవంత్, సర్వేయర్ శరత్ తదితరులు పాల్గొన్నారు.
బంగారు గొలుసు అపహరణ
బుక్కరాయసముద్రం: స్థానిక దేవరకొండ సమీపంలో చైన్ స్నాచింగ్ చోటు చేసుకుంది. వివరాలు.. బీకేఎస్ మండలం పసులూరు గ్రామానికి చెందిన ప్రమీల, శివయ్య దంపతులు గురువారం రాత్రి అనంతపురం నుంచి స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా దేవరకొండ సమీపంలో ఇద్దరు యువకులు ఆపారు. ఈ దారి ఏ ఊరుకెళుతుందంటూ వారి దృష్టిని ఏమార్చి ఓ యువకుడు ఆమె మెడలోని బంగారు గొలుసు లాక్కొని పక్కనే సిద్ధంగా ఉంచుకున్న బైక్‌పై తన సహచరుడితో కలసి ఉడాయించాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.


