ఉరవకొండ: రబీలో సాగు చేసిన పప్పుశనగను కొనుగోలు చేయకుండా చంద్రబాబు ప్రభుత్వం రైతులను దగా చేస్తోందని ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బీహెచ్ రాయుడు మండిపడ్డారు. పప్పుశనగ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, గిట్టుబాటు ధరతో కొనుగోలు చేయాలంటూ గురువారం ఉరవకొండలోని ఏడీఏ కార్యాలయం ఎదుట రైతులతో కలసి చేపట్టిన ధర్నాలో ఆయన మాట్లాడారు. గోదాముల్లో రైతులు నిల్వ ఉంచిన పంటకు ప్రభుత్వమే అద్దె చెల్లించాలన్నారు. కేరళ ప్రభుత్వం ఆ రాష్ట్రంలో మద్దతు ధరతో పాటు బోనస్ చెల్లిస్తూ పంటను కొనుగోలు చేస్తోందని, ఇదే తరహాలో రాష్ట్రంలోనూ క్వింటా రూ.5,650 మద్దతు ధరతో పాటు రూ.2,350 బోనస్ కలిపి రూ.8 వేలతో కొనుగోలు చేయాలని లేకపోతే ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఏడీ సత్యనారాయణకు వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు మధు, రంగారెడ్డి, శీనప్ప, సిద్దప్ప తదితరులు పాల్గొన్నారు.
జనగణనలో జాగ్రత్త వహించాలి
● అధికారులకు జేసీ విష్ణుచరణ్ సూచన
అనంతపురం అర్బన్: కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జనాభా లెక్కల సేకరణలో జాగ్రత్తగా వ్యవహరించాలని సంబంధిత అధికారులను
జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ ఆదేశించారు. జనగణన ప్రక్రియపై జేఎన్‌టీయూ వేదికగా అధికారులకు నిర్వహిస్తున్న మూడు రోజుల శిక్షణ గురువారం ముగిసింది. చివరి రోజున జేసీ హాజరై మాట్లాడారు. మొదటి దశలో భాగంగా ఏప్రిల్ 1 నుంచి మే 31వ తేదీ వరకు గృహ గణన నమోదు ప్రక్రియ నిర్వహించాలన్నారు. ప్రతి గృహానికి ప్రత్యేక నంబర్ కేటాయించాలని, అందులో నివసించే సభ్యుల వివరాలు నమోదు చేయాలని చెప్పారు. మౌలిక సదుపాయాలు, గృహోపకరణాలు, ఫోన్లు, ఇంటర్నెట్, వాహనాలు, ఫ్లోరింగ్, తాగునీటి వినియోగం, మరుగుదొడ్లు తదితర వివరాలు సేకరించాలన్నారు. సేకరించే గణాంకాలు గ్రామ, పట్టణ, రాష్ట్ర, జాతీయ స్థాయిలో అభివృద్ధి ప్రణాళికలు, సంక్షేమ పథకాల రూపకల్పనకు ఆధారమవుతాయన్నారు. లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలన్నారు. అధికారులు తమ విధులను నిబద్ధతతో నిర్వర్తించాలని సూచించారు. వివరాలను కంప్యూటర్ మెయింటెనెన్స్ మేనేజ్‌మెంట్ సిస్టం (సీఎంఎంఎస్) ద్వారా నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. హెచ్‌ఎల్‌ఓ మొబైల్ యాప్ ద్వారా ప్రజలు తమ వ్యక్తిగత వివరాలను స్వయంగా నమోదు చేసుకునే అవకాశమూ ఉందన్నారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ ఎ.మలోల, సెన్సెస్ జాయింట్ డైరెక్టర్ జగన్నాథ్ మజ్‌హి, మాస్టర్ ట్రైనర్ మోహన్ రమవణా, గణాంక అధికారి గిరిధర్, కో–ఆర్డినేషన్ సూపరింటెండెంట్ యుగేశ్వరిదేవి, ఆర్డీఓలు, తహసీల్దార్లు, మునిసిపల్ కమిషనర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.


