ఉరవకొండ: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను చెల్లిస్తామంటూ ఇచ్చిన హామీని నెరవేర్చకుండా విద్యార్థులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని చంద్రబాబు ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి ప్రశ్నించారు. గురువారం శాసనమండలి సమావేశాల్లో ప్రత్యేక నివేదన ద్వారా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై మంత్రి నారా లోకేష్‌ను శివరామిరెడ్డి గట్టిగా నిలదీశారు. మొత్తం రూ.6,300 కోట్ల మేర బకాయిలు పేరుకుపోతే కేవలం రూ.1,200కోట్లు మాత్రమే ఎలా విడుదల చేస్తామనడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. అది కూడా ప్రస్తుతానికి రూ.1,200 కోట్లు ఇవ్వలేమని, ప్రత్యామ్నాయంగా సదరు బకాయిల మొత్తానికి బ్యాంకుల ద్వారా 8 శాతం వడ్డీతో రుణం ఇప్పిస్తామని, నిధులు విడుదలయ్యాయి అసలు ప్రభుత్వం జమ చేస్తే వడ్డీని కళాశాల యాజమాన్యాలే భరించాలని మంత్రి నారా లోకేష్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌బకాయిలు చెల్లింపులపై పూటకో మాట మారుస్తూ కాలయాపన చేయడం సబబు కాదని హితవు పలికారు. 8 శాతం వడ్డీతో రుణం ఇప్పిస్తామనే ఆలోచనను విరమించి, తక్షణమే మొత్తం బకాయిలు చెల్లించి విద్యార్థుల చదువులకు ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
శాసనమండలిలో ఎమ్మెల్సీ శివరామిరెడ్డి డిమాండ్


