కదిరి: ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదవరోజైన మంగళవారం ఖాద్రీశుడు హనుమద్ వాహనంపై తిరువీధుల్లో ఊరేగుతూ కనువిందు చేశారు. అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు శ్రీవారిని దర్శించుకొని భక్తిపారవశ్యంతో మునిగితేలారు. చంద్రగ్రహణం కారణంగా రోజంతా ఆలయం తలుపులు మూసివేశారు. గ్రహణం వీడిన అనంతరం ఆలయశుద్ధి, సంప్రోక్షణ తర్వాత భక్తులను సర్వ దర్శనానికి ఆలయంలోకి అనుమతించారు. నరసింహావతారంలో హిరణ్యకశ్యపుని సంహారం అనంతరం మహావిష్ణువును సాక్షాత్తు హనుమంతుడే దిగివచ్చి తన భుజస్కందాలపై మోస్తాడని భక్తుల నమ్మకం. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం విల్లంబులు ధరించి హనుమంతుడి భుజాలపై కొలువుదీరిన శ్రీవారిని చూసేందుకు రెండు కళ్లు సరిపోలేదు. త్రేతాయుగంలో తనకు సేవ చేసిన భక్త శిఖామణి హనుమంతుడినే వాహనంగా చేసుకొని స్వామివారు తిరువీధుల్లో ఊరేగింపుగా వెళ్లారు. భక్తుల కాలక్షేపం కోసం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. ఉత్సవ ఉభయదారులుగా మాజీ ఎమ్మెల్యే జొన్నా రామయ్య కుటుంబ సభ్యులు వ్యవహరించారని ఆలయ ఈఓ శ్రీనివాసరెడ్డి తెలిపారు.
నేడు బ్రహ్మ గరుడసేవ
ఖాద్రీ లక్ష్మీ నారసింహుడు బుధవారం గరుడ వాహనంపై తిరువీధుల్లో తన భక్తులకు దర్శనమిస్తారు. బ్రహ్మోత్సవాలకు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడే ఈ బ్రహ్మోత్సవాలను దగ్గరుండి నడిపిస్తారని భక్తుల నమ్మకం. బ్రహ్మ గరుడ సేవలో స్వామివారిని తూర్పు రాజగోపురం వద్ద దర్శించుకుంటే మరింత పుణ్యం సిద్ధిస్తుందంటారు. లక్ష్మీ నరసింహస్వామిని తమ ఇలవేల్పుగా కొలిచే భక్తులంతా బ్రహ్మగరుడు సేవ రోజునే కదిరి పున్నమి పేరుతో పండుగను జరుపుకుంటారు.
గ్రహణం వీడిన తర్వాత దర్శనం కోసం బారులు తీరిన భక్తులు హనుమద్ వాహనంపై దర్శనమిస్తున్న శ్రీవారు


