● నేత్రపర్వంగా కల్యాణోత్సవం.. రథోత్సవం
యాడికి: చెన్నకేశవస్వామి గోవిందా.. గోవింద నామస్మరణతో మండల కేంద్రం యాడికి మార్మోగింది. శివలక్ష్మీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. సోమవారం కల్యాణోత్సవం.. రథోత్సవం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఆలయ ప్రధాన అర్చకులు హరికృష్ణ శర్మ ఆధ్వర్యంలో ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కల్యాణోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఐదు గంటల సమయంలో ఉత్సవమూర్తులను పల్లకీలో తీసుకొచ్చి ఆలయం ఎదురుగా ఉన్న రథం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అనంతరం రథంపై భూదేవి, శ్రీదేవి సమేత శివలక్ష్మీ చెన్నకేశవస్వామి ఉత్సవమూర్తులను కొలువుదీర్చారు. తహసీల్దార్ ప్రతాప్‌రెడ్డి అశేష భక్త జనసందోహంతో కలిసి గోవిందా.. గోవింద అంటూ మడుగు తేరు లాగారు. కెనరా బ్యాంక్ వరకు సాగింది. ఉదయం 8గంటల సమ యంలో రథం పాత పోలీస్టేషన్, కోమటి బజార్, పెద్దమ్మ తల్లి దేవాలయం మీదుగా 12 గంటల సమయం లోపే యథాస్థానానికి చేరుకుంది. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ఎస్‌ఈసీ సభ్యుడు బొంబాయి రమేష్ నాయుడు, ఎంపీటీసీ సభ్యులు వెంకటనాయుడు, నాగరాజు, రామ్మోహన్, ఉప సర్పంచ్ చంద్రమోహన్, సీనియర్ నాయకుడు బాలా రమేష్ బాబు, మాజీ సర్పంచ్ రమేష్ బాబు, ఆలయ ఈఓ దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తిరునాళ్ల సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏఎస్పీ రోహిత్‌కుమార్ చౌదరి ఆదేశాల మేరకు సీఐ శ్రీనివాసులు తాడిపత్రి, యాడికి, పెద్దపప్పూరు సీఐలు, ఎస్‌ఐలతో కలిసి దాదాపు 80 మంది పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.


