పట్టు వీడకపోతే పోరుబాట తప్పదు | - | Sakshi
Sakshi News home page

పట్టు వీడకపోతే పోరుబాట తప్పదు

Mar 4 2026 7:36 AM | Updated on Mar 4 2026 7:36 AM

చంద్రబాబు ప్రభుత్వాన్ని హెచ్చరించిన ఆర్టీసీ ఈయూ నేతలు

అనంతపురం క్రైం: విద్యుత్‌ బస్సుల నిర్వహణ పేరుతో దశల వారీగా ఆర్టీసీని ప్రైవేటు సంస్థలకు అప్పగించే ప్రయత్నాలను తక్షణమే విరమించుకోకపోతే పోరాటాలు ఉధృతం చేస్తామని చంద్రబాబు ప్రభుత్వాన్ని ఏపీఎస్‌ ఆర్టీసీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (ఈయూ) నేతలు హెచ్చరించారు. మంగళవారం అనంతపురంలోని వి.కె.భవన్‌లో యూనియన్‌ జిల్లా 2వ నిర్మాణ సభ జరిగింది. జిల్లా అధ్యక్షుడు ఆర్‌.వి. భాస్కరరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు పలిశెట్టి దామోదరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.వి.నరసయ్య హాజరయ్యారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ప్రధానమంత్రి ఈ–బస్‌ పథకం పేరుతో పూణేకు చెందిన పినాకల్‌ కంపెనీకి ఏపీలోని 11 డిపోల పరిధిలో 12 స్థలాలను కేటాయించేలా చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆర్టీసీ మనుగడకు ప్రమాదకరంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్‌, సీఎన్‌జీ, డీజిల్‌ తదితర బస్సులన్నీ ఆర్టీసీ ద్వారానే, ఆర్టీసీ సిబ్బందితోనే నడపాలని, డిపోలను ప్రైవేట్‌ కన్సార్టియంకు అప్పగించే నిర్ణయాలను రద్దు చేసుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం జారీ చేసిన జి.ఓ. ప్రకారం సుమారు 6 వేల మందికి పదోన్నతులు అందాల్సి ఉండగా... ఇప్పటివరకు కేవలం 3,300 మందికే కల్పించారన్నారు. మిగిలిన వారికి వెంటనే పదోన్నతులు కల్పించాలని కోరారు. డీఏ బకాయిలు, 11వ పీఆర్సీ అరియర్స్‌ (24 నెలల బకాయిలు) వెంటనే చెల్లించాలని, ఐఆర్‌ ప్రకటించి 12వ పీఆర్సీని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. విశ్రాంత ఉద్యోగులకు గ్రాట్యూటీ, టెర్మినల్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌ చెల్లింపులు చేయాలన్నారు. సమావేశంలో డిప్యూటీ సీఎంఈ రమేష్‌, డిపో మేనేజర్‌ శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు. ఏపీజేఏసీ అమరావతి జిల్లా అధ్యక్షుడు ఆర్‌.ఎన్‌.దివాకర్‌ రావు, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి రాజారెడ్డి తదితరులు సంఘీభావం తెలిపారు.

నూతన కమిటీ ఎన్నిక:

సభ అనంతరం నేతలు జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా ఆర్‌.వి.భాస్కరరెడ్డి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఎం.ఎస్‌.రాజు, చీఫ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా పీఎస్‌ఏ ఖాన్‌, కార్యదర్శిగా కె. కొండయ్య, ప్రచార కార్యదర్శిగా కె.కల్లప్ప, కోశాధికారిగా పి.శ్రీనివాసరావు ఎన్నికయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement