● నాగులగుడ్డం తండాలో ఘటన
● సీసీరోడ్ల నిర్మాణ విషయంలో ఇప్పటికే ఘర్షణ
● తాజాగా కంకర టిప్పరును అడ్డుకోవడంతో బాహాబాహీ
శింగనమల: మండలంలోని నాగులగుడ్డం తండాలో టీడీపీ నేతల మధ్య కక్షలు తారాస్థాయికి చేరుకున్నాయి. ప్రధాన మంత్రి ధర్తి అభజన జాతీయ ఉత్కర్ష అభియాన్ కింద మూడేళ్ల క్రితం నాగులగుడ్డం తండా పంచాయతీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ పనులు చేపట్టే విషయంలో అప్పటి నుంచి టీడీపీ నేతలు ఘర్షణ పడుతూ వస్తున్న విషయం తెలిసిందే. అయితే నిధులు వెనక్కు మళ్లే అవకాశం ఉండడంతో చివరకు పంచాయతీ రాజ్ అధికారులే గత నెల 28న స్వయంగా రంగంలో దిగి సీసీ రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. ఆ సమయంలోనూ టీడీపీ నాయకులు గొడవ పడి అడ్డుకున్నారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి 9 గంటలకు సీసీ రోడ్డుకు ఓ వర్గం టీడీపీ నేతలు కంకర తోలుతుండగా ఇంకో వర్గం నేతలు అడ్డుకున్నారు. ఆ సమయంలో ఘర్షణ చోటు చేసుకుని పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. ఘటనలో రామాంజినాయక్, రమేష్ నాయక్, వెంకటలక్ష్మికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని వెంటనే శింగనమలలోని సీహెచ్‌సీకి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురానికి తరలించారు. మరో వర్గానికి చెందిన వెంకటేష్ నాయక్‌కు గాయాలయ్యాయి. ఘటనపై పోలీసులు ఆరా తీశారు.


