దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం అందించే చౌకబియ్యం పక్కదారి పడుతోంది. ఇదివరకు కార్డుదారుల వద్ద నుంచి చౌకబియ్యాన్ని వ్యాపారులు తక్కువ ధరకు కొని బ్లాక్‌ మార్కెట్లో అమ్ముకునేవారు. కొందరు డీలర్లు అయితే తూకాలు తక్కువ ఇస్తూ పోగు చేసుకున్న బియ్యా | - | Sakshi
Sakshi News home page

దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం అందించే చౌకబియ్యం పక్కదారి పడుతోంది. ఇదివరకు కార్డుదారుల వద్ద నుంచి చౌకబియ్యాన్ని వ్యాపారులు తక్కువ ధరకు కొని బ్లాక్‌ మార్కెట్లో అమ్ముకునేవారు. కొందరు డీలర్లు అయితే తూకాలు తక్కువ ఇస్తూ పోగు చేసుకున్న బియ్యా

Mar 3 2026 8:06 AM | Updated on Mar 3 2026 8:06 AM

అనంతపురం అర్బన్‌ : చంద్రబాబు ప్రభుత్వంలో చౌకధరల దుకాణాల డీలర్లు నయా దందాకు తెరలేపారు. కార్డుదారులకు బియ్యం ఇవ్వకుండా వారితో నేరుగా వ్యాపారం చేస్తున్నారు. ఇళ్లవద్దకే వెళ్లి బియ్యం పంపిణీ చేసినట్లుగా ఈ–పాస్‌లో వేలిముద్ర వేయించుకుంటున్నారు. కిలోకు రూ.10 చొప్పున కార్డుదారులకు డబ్బులు చెల్లిస్తున్నారు. తమకు బియ్యం వేయండని అడిగిన కార్డుదారులకు కూడా బలవంతంగా డబ్బులు అంటగడుతున్నట్లు సమాచారం. ఇలాంటి ఘటన అనంతపురం నగరంలోని గుల్జార్‌పేటలో వెలుగుచూసింది. డీలర్‌ తీరుపై ఫిర్యాదులు వెళ్లడంతో పౌర సరఫరాల అఽధికారులు విచారణ చేపట్టారు.

పంపిణీ చేశారిలా..

చౌకడిపో డీలర్‌ ప్రతి నెలా 26 తేదీ నుంచి నెలాఖరు వరకు వృద్ధులు, నిస్సహాయులకు వారి ఇళ్ల వద్దకే వెళ్లి బియ్యం పంపిణీ చేయాలి. ఒకటవ తేదీ నుంచి ఇతర కార్డుదారులకు చౌక దుకాణం వద్ద బియ్యం, ఇతర సరుకులు అందజేయాలి. అయితే గుల్జార్‌ పేటలోని 1285033 నంబరు గల చౌక దుకాణం డీలరు ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. కార్డుదారుల ఇళ్ల వద్దకే వెళ్లి ఈ–పాస్‌ మిషన్‌లో వేలిముద్ర వేయించుకుని.. బియ్యానికి బదులు డబ్బులు ఇస్తున్నట్లు తెలిసింది. ఈ డీలరు ఫిబ్రవరి 26న 50 కార్డులకు, 27వ తేదీన 27 కార్డులు, 28న నాలుగు కార్డులు, మార్చి 1న 57 కార్డు దారులకు బియ్యం పంపిణీ చేసినట్లు వేలిముద్ర వేయించుకుని.. బదులుగా డబ్బులు ఇచ్చినట్లు తెలిసింది.

బ్లాక్‌ మార్కెట్‌కు చౌకబియ్యం

కార్డుదారులకు బియ్యం ఇవ్వకుండా బదులుగా కిలోకు రూ.10 చొప్పున డబ్బులు ఇస్తున్నట్లు డీలర్‌పై ఫిర్యాదులు ఉన్నాయి. ఒక రకంగా కార్డుదారులతోనే డీలర్లు వ్యాపారం చేస్తున్నారన్నమాట. కొన్ని చోట్ల కిలో బియ్యం రూ.13 నుంచి రూ.15తో కొనుగోలు చేసి.. బ్లాక్‌ మార్కెట్‌లో కిలో రూ.18 నుంచి రూ.20 వరకు విక్రయిస్తున్నట్లు తెలిసింది. జిల్లాలో కొందరు ఇలాంటి దందా సాగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

కార్డుదారులతో నేరుగా వ్యాపారం

ఇళ్లవద్దకే వెళ్లి వేలిముద్ర తీసుకుంటున్న డీలర్లు

బియ్యానికి బదులు డబ్బులు

కావాలన్న కార్డుదారులకు బియ్యం ఇవ్వని వైనం

అనంతపురంలో బయటపడ్డ తంతు

అనంతపురంలోని గుల్జార్‌పేటలోని చౌకదుకాణం (1285033) డీలర్‌ వ్యవహారంపై ఫిర్యాదు అందింది. విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని సీఎస్‌డీటీ సుబ్రహ్మణ్యంను ఆదేశించాను. సీఎస్‌డీటీ అక్కడికి వెళ్లి దుకాణం వద్ద వీఆర్‌ఓను ఉంచి కార్డుదారులకు బియ్యం వేయించారు. సీఎస్‌డీటీ నుంచి విచారణ నివేదిక అందిన తరువాత డీలర్‌పై తదుపరి చర్యలు ఉంటాయి. డీలర్లు తప్పనిసరిగా కార్డుదారులకు రేషన్‌ పంపిణీ చేయాలి. అలా చేయని వారిపై శాఖాపరంగా చర్యలు ఉంటాయి.

– వెంకటేశ్వర్లు, జిల్లా సరఫరాల అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement