అనంతపురం అర్బన్ : భూ సమస్యలను పరిష్కరించడంలో రెవెన్యూ శాఖ వెనకబడుతోంది. ప్రజాసమస్యల పరిష్కార వేదికకు ప్రతి వారం అందే అర్జీల్లో అధికభాగం భూ సమస్యలే ఉంటుండటమే ఇందుకు నిదర్శనం. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగమైన రెవెన్యూ క్లినిక్‌కు భూ సమస్యలపై అర్జీలు వెల్లువెత్తాయి. పరిష్కార వేదికకు ప్రజల నుంచి వివిధ సమస్యలపై 504 అర్జీలు అందాయి. వాటిలో రెవెన్యూకు సంబంధించి 385 అర్జీలు ఉండగా ఇతర సమస్యలకు సంబంధించి 119 వినతులు ఉన్నాయి. అర్హత కలిగిన వితంతు, దివ్యాంగులు, దీర్ఘకాలికవ్యాధిగ్రస్తులు, వృద్ధులు పింఛన్ల కోసం తరచూ అర్జీలు అందజేస్తున్నా.. మంజూరు మాత్రం కావడం లేదు. పరిష్కార వేదికలో ప్రజల నుంచి జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహర్, డీఆర్‌ఓ మలోల, ఎఫ్‌ఎస్‌ఓ రామకృష్ణారెడ్డి, డిప్యూటీ కలెక్టర్లు ఆనంద్, రామ్మోహన్, మల్లికార్జునుడు అర్జీలు స్వీకరించారు. కార్యక్రమం అనంతరం అర్జీల పరిష్కారంపై అధికారులతో జాయింట్ కలెక్టర్ సమీక్షించారు. అర్జీదారులు సంతృప్తి చెందేలా సమస్యకు నాణ్యమైన పరిష్కారం చూపించాలని ఆదేశించారు.
అర్జీల్లో మచ్చుకు కొన్ని..
తనపై ఉన్న రౌడీషీట్ తొలగించాలని గుంతకల్లు మండలం ఇమాంపురం ఎస్టీ కాలనీకి చెందిన మదన్‌మోహన్ యాదవ్ విన్నవించాడు. తన వయసు 24 ఏళ్లని, ప్రస్తుతం బీఈడీ చేస్తున్నానని చెప్పాడు. గుంతకల్లు డీఎస్పీ తనపై రౌడీషీట్ తెరిచారని పేర్కొన్నాడు. దాన్ని తొలగించాలని కోరుతూ ఎస్పీకి విన్నవించినా న్యాయం జరగలేదన్నాడు. ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నానని చెప్పాడు. తన భవిష్యత్తు పాడవకుండా రౌడీషీట్ తొలగించేలా చూడాలని వేడుకున్నాడు.
● వితంతు పింఛను మంజూరు చేయాలని కణేకల్లు మండలం బ్రహ్మసముద్రం గ్రామానికి చెందిన చిన్నమారెక్క విన్నవించింది. అనారోగ్యంతో తన భర్త మరణించాడని తెలిపింది. తనకు ఎలాంటి ఆస్తిపాస్తులూ లేవని పేర్కొంది. కూలి పనులు చేసుకుంటూ జీవనంసాగిస్తున్నాని తెలిపింది. వింతతు పింఛను మంజూరు చేస్తే కాస్త ఆర్థికంగా వెసులుబాటు కలుగుతుందని కోరింది.
● కిడ్నీ సమస్యతో బాధపడుతున్న తనకు పింఛను మంజూరు చేయించాలని అనంతపురంలోని రాజమ్మ కాలనీకి చెందిన కురుగోడు శంకర్ విన్నవించాడు. తనకు ఒక కిడ్నీ తొలగించారని, రెండవది కూడా సరిగ్గా పనిచేయడం లేదని చెప్పాడు. మందులకు చాలా ఖర్చు అవుతోందని తెలిపాడు. పింఛను మంజూరు చేస్తే కొంత ఆసరాగా ఉంటుందని విజ్ఞప్తి చేశాడు.
● ఇతని పేరు తాటిచెర్ల లక్ష్మణమూర్తి. అనంతపురంలోని సోమనాథ్‌నగర్ నివాసముంటున్నాడు. ఇంటి పక్కనే ఒకవ్యక్తి కోళ్ల ఫారం ఏర్పాటు చేశాడు. కోళ్ల పెంట నుంచి వెలువడుతున్న దుర్వాసన భరించలేకుండా ఉంది. సమస్యపై ప్రజాసమస్యల పరిష్కార వేదికలో ఒకసారి ఫిర్యాదు చేస్తే.. నగర పాలక సంస్థ వారు వచ్చి ఫొటోలు తీసుకుని వెళ్లారు. ఆ తరువాత కోళ్ల ఫారం తొలగించి సమస్య పరిష్కరించామని ఎండార్స్‌మెంట్ పంపించారు. వాస్తవంగా కోళ్ల ఫారాన్ని తొలగించలేదు. దీంతో మరోసారి ఫిర్యాదు చేయడానికి వచ్చానని లక్ష్మణమూర్తి తెలిపాడు.
పరిష్కారం కాక అర్జీదారుల అవస్థలు
పింఛన్ల కోసం అధికారుల చుట్టూ ప్రదక్షిణలు
ప్రజాసమస్యల పరిష్కార వేదికలో మళ్లీమళ్లీ అవే సమస్యలు


