● టమాట, అరటి, చీనీ ధరలు ఢమాల్
● నిరాశాజనకంగా మార్కెట్
● రైతులను ఆదుకోని బాబు సర్కార్
అనంతపురం అగ్రికల్చర్: ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఏపీగా పేరుగాంచిన అనంతపురం జిల్లా ఉద్యాన పంటల పెట్టింది పేరు. అందులో ప్రధానంగా చీనీ తోటలు 90 వేలు, టమాట 40 వేలు, మామిడి 39 వేలు, అరటి 38 వేల ఎకరాల చొప్పున మొత్తం 2 లక్షల ఎకరాల్లో విస్తరించాయి. మిగతా అన్ని పంటలు మరో 1.20 లక్షల ఎకరాల్లో సాగవుతున్నాయి. అయితే ఈ ఏడాది మార్కెట్ నిరాశాజనకంగా ఉండటంతో రైతులు నష్టాలపాలవుతున్నారు. మరీ ముఖ్యంగా చీనీ, టమాట పరిస్థితి మరింత దారుణంగా ఉంది. మద్దతు ధరలు లేక రైతులు ఆందోళన చెందుతున్నా.. చంద్రబాబు ప్రభుత్వం ఆదుకునే చర్యలు చేపట్టడం లేదు.
● చీనీ సీజన్ ప్రారంభమైన జనవరి నుంచి మద్దతు ధర దక్కడం లేదు. వేసవి ఆరంభమైనా ధర పెరగకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గత నెలన్నర రోజులుగా అనంతపురం వ్యవసాయ మార్కెట్‌యార్డులో టన్ను రూ.7 వేల నుంచి రూ.15 వేలు, ప్రస్తుతం రూ.22 వేలకు పరిమితమైంది. టన్ను రూ.35 వేల నుంచి రూ.40 వేలు లభిస్తే కానీ గిట్టుబాటు కాదంటున్నారు. ఈసారి గత నవంబర్, డిసెంబర్‌లో తుపాన్ వల్ల చిరుజల్లులు కురవడం, జనవరి, ఫిబ్రవరిలో విపరీతమైన చలి వాతావరణ పరిస్థితుల కారణంగా చీడపీడలు సోకకుండా చీనీ తోటల్లో 10 నుంచి 15 విడతల పాటు పురుగుమందులు పిచికారీ చేయడంతో పెట్టుబడులు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలోటన్ను రూ.15 వేలు, రూ.20 వేలు అంటే ఏ మాత్రమూ గిట్టుబాటు కాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
● టమాట.. మరో జాక్‌పాట్‌గా పంటగా మారిపోయింది. జిల్లా నలుమూలలా టమాట సాగు చేశారు. జనవరి 15 నుంచి అనంతపురం శివారులోని కక్కలపల్లి మార్కెట్‌లో టమాట కిలో రూ.4, రూ.6, రూ.7 ఇలా సింగిల్ డిజిట్‌కే పరిమితమైంది. కిలో రూ.20 పలికితే కానీ రైతులకు గిట్టుబాటు కాదని చెబుతున్నారు. మారిన వాతావరణ పరిస్థితుల్లో చీడపీడల వ్యాప్తి బాగా పెరగడంతో పిచికారీకి పెద్ద మొత్తంలో ఖర్చు చేశారు. కానీ మార్కెట్ నిలకడ లేకుపోవడంతో రైతులు నష్టాలు చవిచూస్తున్నారు.
● అరటి రైతుల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక మాదిరిగా తయారైంది. పది రోజుల కింద టన్ను రూ.25 వేలు ఉండగా ఇప్పుడు రూ.15 వేలకు పతనమైంది. యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో గల్ఫ్ దేశాలకు ఎగుమతులు తగ్గే పరిస్థితి ఉండటంతో అరటి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్చి నుంచి ఏప్రిల్ వరకు మొదటి పంట కింద అరటి పెద్ద ఎత్తున అమ్మకాలు జరిగే పరిస్థితి ఉంది.
● రేపో మాపో మార్కెట్‌కు రానున్న మామిడి రైతులకు కూడా ధరల భయం పట్టుకుంది. వేసవి మండుతున్నా కర్బూజా, కళింగర ధరలు కూడా తగ్గిపోయాయి. గతేడాది రాష్ట్రస్థాయిలో హార్టికల్చర్ కాంక్లేవ్ నిర్వహించి ఉద్యాన రంగానికి చేయూత ఇస్తామని భరోసా కల్పించిన మంత్రులు, ప్రజా ప్రతినిధులు, జిల్లా యంత్రాంగం ఇప్పుడు రిక్తహస్తం చూపిస్తుండటంతో ఉద్యాన రైతులు నష్టాలు మూటగట్టుకుంటున్నారు. రాయలసీమను ఉద్యానహబ్‌గా మార్చుతామని, ఇటీవల బడ్జెట్‌లోనూ ప్రాధాన్యత ఇచ్చామని చంద్రబాబు సర్కారు చెబుతున్న మాటలకు.. చేతలకు పొంతన లేకుండా పోతోంది.


