అనంతపురం: ప్రాధాన్యత లేని పోస్టు నుంచి ఆయన ఏకంగా కీలక అధికారి స్థానం దక్కించుకున్నారు. జాబితాలో లేని పోస్టును యూజీసీ పే స్కేల్ కింద చూపుతూ ఇంక్రిమెంట్ అరియర్స్ పేరిట రూ.43 లక్షలకు ఫైలు సిద్ధం చేశారు. ఆడిటింగ్ విభాగంలో అభ్యంతరం లేకుండా ఫైలు ముందుకు పంపేలా సంబంధిత అధికారులకు ‘ఎర’ వేసినట్లు సమాచారం. ఉన్నతాధికారి ‘అధికార దుర్వినియోగం’ ఇప్పుడు ఎస్కే యూనివర్సిటీలో చర్చనీయాంశంగా మారింది.
ఇలా ఎగబాకేశారు!
శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఆయన మొదట రీసెర్చ్ కమ్ స్టాటిస్టికల్ అసిస్టెంట్‌గా చేరారు. అనంతరం రీసెర్చ్ కమ్ స్టాటిస్టికల్ ఆఫీసర్‌గా హోదాను మార్పు చేశారు. యూజీసీ పే స్కేల్ కింద జీతం పొందాలంటే తప్పనిసరిగా నిర్దేశించిన పోస్టుల్లోనే పనిచేస్తుండాలి. 2016 యూజీసీ పే స్కేల్ పొందడానికి నిర్దేశించిన జాబితాలో ‘రీసెర్చ్ కమ్ స్టాటిస్టికల్ ఆఫీసర్’ పోస్టు లేదు. అయినా యూజీసీ పే స్కేల్ జాబితాలో ఈ పోస్టు ఉన్నట్లు రికార్డుల్లో చూపి.. పెద్ద మొత్తంలో జీతం ‘ఫిక్స్’ చేసుకున్నారు. ఇందుకు అనుగుణంగా ఇంక్రిమెంట్ అరియర్స్ రూ.43 లక్షలు రావాల్సి ఉందని ప్రతిపాదనలు సిద్ధం చేసి, బిల్లును రాష్ట్ర ఆడిటింగ్ విభాగానికి పంపారు. రేపో.. మాపో ఆడిటింగ్ అధికారుల ఆమోదం పొందితే సదరు బిల్లు ఉన్నతాధికారి ఖాతాలో జమవుతుంది.
అలా చక్రం తిప్పేస్తున్నారు..
యూజీసీ జాబితాలో లేని రీసెర్చ్ కమ్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఉద్యోగంలో చేరి.. యూజీసీ పే స్కేల్ పొందుతున్నారు. తాజాగా యూనివర్సిటీలో కీలక పదవుల్లో ఒక్కటైన రిజిస్ట్రార్ పీఠం ఎక్కారు. ఉద్యోగుల జీతాలు, ఇతర బిల్లులకు ఆమోదం తెలిపే స్థాయికి ఎదిగారు. వాస్తవానికి అసోసియేట్ ప్రొఫెసర్, డిప్యూటీ రిజిస్ట్రార్ హోదాలో ఉన్నవారే రిజిస్ట్రార్ పదవికి అర్హులు. కానీ ప్రాధాన్యత లేని పోస్టులో ఉండి.. రిజిస్ట్రార్‌గా కొనసాగుతూ.. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారనే విమర్శలను సదరు అధికారి ఎదుర్కొంటున్నారు.
జాబితా లేకున్నా ఫర్వాలేదు
ఇంక్రిమెంట్ అరియర్స్ కోసం దరఖాస్తు చేసుకున్నాను. 1996 యూజీసీ పే స్కేల్‌లో రీసెర్చ్ కమ్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టు ఉంది. తాజాగా యూజీసీ పే స్కేల్‌లో లేకపోయినా..ఫర్వాలేదు. అప్పట్లో ఆ పోస్టు ఉంది కాబట్టి.. యూజీసీ పే స్కేల్‌కు క్లెయిమ్ చేసుకున్నాను.
– రమేష్ బాబు, రిజిస్ట్రార్, ఎస్కేయూ
ఆపై అధికార దుర్వినియోగం
యూజీసీ పే స్కేలు పొందేందుకు ఎత్తుగడ
రూ.43 లక్షల ఇంక్రిమెంట్ అరియర్స్ కోసం క్లెయిమ్
ఎస్కేయూ ఉన్నతాధికారి తీరుపై సర్వత్రా విమర్శలు


