తాడిపత్రి రూరల్: ద్విచక్ర వాహనం కొనివ్వలేదని ఓ యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు తెలిపిన మేరకు... తాడిపత్రిలోని టైలర్స్ కాలనీలో నివాసముంటున్న నాగేంద్ర, కళావతి దంపతుల కుమారుడు సాయికిరణ్ (21) టైల్స్ పరిచే పనులకు వెళుతూ కుటుంబానికి చేదోడుగా నిలిచాడు. తనకు ఓ ద్విచక్ర వాహనం కొనివ్వాలంటూ వారం రోజులుగా తల్లిదండ్రులను కోరుతున్నాడు. ఆర్థిక పరిస్థితి సరిగా లేదని, కాస్త కుదుట పడగానే బైక్ కొందామంటూ తల్లిదండ్రులు నచ్చచెబుతూ వచ్చేవారు. అయితే బైక్ కొనాలన్న తన ఆకాంక్ష ఎన్నటికీ నెరవేరదని భావించిన సాయికిరణ్ క్షణికావేశంలో ఆదివారం రాత్రి తాడిపత్రి – చల్లవారిపల్లి రైల్వే స్టేషన్ల మధ్య మార్గంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు సోమవారం ఉదయం అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఘటనా స్థలంలో లభ్యమైన సెల్‌ఫోన్ నంబర్ల ఆధారంగా మృతుడిని సాయికిరణ్‌గా నిర్ధారించుకుని సమాచారం ఇవ్వడంతో తల్లిదండ్రులు అక్కడకు చేరుకుని ధ్రువీకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ వరప్రసాద్ తెలిపారు.
ఓపెన్ ఇంటర్
పరీక్షలు ప్రారంభం
అనంతపురం ఎడ్యుకేషన్: సార్వత్రిక విద్యా పీఠం (ఓపెన్ స్కూల్) ఇంటర్ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 9 కేంద్రాలు ఏర్పాటు చేశారు. తొలిరోజు జరిగిన ఇంగ్లిష్ పరీక్షకు 2,113 మంది అభ్యర్థులకు గాను 1,850 మంది హాజరయ్యారు. 263 మంది గైర్హాజరయ్యారు. డీఈఓ ప్రసాద్‌బాబు వివిధ కేంద్రాలను పరిశీలించారు.
టీచర్ల సీనియార్టీ
జాబితాలు సిద్ధం
అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లా విద్యాశాఖ పరిధిలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మునిసిపాలిటీలు, మునిసిపల్ కార్పొరేషన్ యాజమాన్యాల్లో పని చేస్తున్న ఎస్జీటీలు, స్కూల్ అసిస్టెంట్లు, ప్రధానోపాధ్యాయుల సాధారణ సీనియార్టీ జాబితాను సిద్ధం చేసినట్లు డీఈఓ ప్రసాద్‌బాబు తెలిపారు. సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఉపాధ్యాయ సమాచార వ్యవస్థ (టిస్) ఆధారంగా జాబితాను తయారు చేసినట్లు పేర్కొన్నారు. జిల్లా అధికారిక వెబ్‌సైట్ deoanantapur.blogspot. comలో జాబితా ఉంచినట్లు తెలిపారు. ఈ జాబితాపై ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా ఈ నెల 9లోగా (పని దినాల్లో) డీఈఓ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. అభ్యంతరం తెలిపే టీచరు పూర్తిపేరు, హోదా, సంబంధిత వివరాలు, జాబితాలో తప్పిదం ఎక్కడ ఉందో స్పష్టంగా పొందుపరచాలని పేర్కొన్నారు. ఆధారాలు, సంబంధిత సాక్ష్యాలు జత చేయాలని సూచించారు. ఫిర్యాదుల పరిష్కార కమిటీ అభ్యంతరాలను పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు.


