హైకోర్టు ఆదేశాలు బేఖాతరు
కూడేరు: హైకోర్టు ఆదేశాలనే రెవెన్యూ అధికారులు ధిక్కరించారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు ఆర్డీఓ తలొగ్గి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. సుమారు 80 ఏళ్లుగా సాగులో ఉంటూ భూహక్కులు కల్గిన వారికే నోటీసులిచ్చి ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
కూడేరు మండలం జల్లిపల్లిలో సర్వే నంబర్ 486లో 24.45 ఎకరాల భూమి ఉంది. అన్నదమ్ములైన బైరెడ్డి వెంకటరామిరెడ్డి, బైరెడ్డి పెద్దిరెడ్డి, బైరెడ్డి లింగారెడ్డి అనుభవంలో ఈ భూమి ఉంది. 1979లోనే వారికి రైతు వారి పట్టా ఇచ్చారు. ఈ భూమిని వారి కుటుంబ సభ్యులు బైరెడ్డి వరలక్ష్మి (వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ బైరెడ్డి రామచంద్రారెడ్డి భార్య) 4.08 ఎకరాలు, బైరెడ్డి నాగమణి (బైరెడ్డి రామచంద్రారెడ్డి సోదరుడు లక్ష్మిరెడ్డి భార్య) 4 ఎకరాలు, గోపాల్ రెడ్డి 1.20 ఎకరాలు, భూపతిరెడ్డి 4.07 ఎకరాలు, రాంకుమార్ రెడ్డి 4.08 ఎకరాలు, మహేశ్వరరెడ్డి 2.04 ఎకరాలు, బొజ్జ నందిని 2.03 ఎకరాలు, సురేంద్రనాథ్‌రెడ్డి 3 ఎకరాలు పంచుకుని సాగులో ఉన్నారు. 2007లో బైరెడ్డి రామచంద్రారెడ్డి (వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్) సోదరులు భాగపరిష్కారాలు చేసుకొని భూవివరాలను రెవెన్యూ రికార్డుల్లో కూడా నమోదు చేయించుకున్నారు. 2023లో బైరెడ్డి రామచంద్రారెడ్డి తన భార్య పేరిట రిజిస్ట్రేషన్ కూడా చేయించాడు. రెవెన్యూ రికార్డు మేరకు ఆన్‌లైన్‌లో బైరెడ్డి వరలక్ష్మి పేరిట 4.08 ఎకరాలు, బైరెడ్డి నాగమణి పేరిట 4 ఎకరాలు భూమి ఉంది.
సమస్య మొదలైంది ఇలా..
బైరెడ్డి రామచంద్రారెడ్డి మరో సోదరుడు మోహన్‌రెడ్డి వరలక్ష్మి, నాగమణి పేరిట ఉన్న భూమిలో కూడా భాగం కావాలని రెండేళ్ల క్రితం గొడవకు దిగాడు. దీంతో రామచంద్రారెడ్డి, లక్ష్మిరెడ్డి పోలీసులను ఆశ్రయించారు. భూ పంపకాల మేరకు రాసుకున్న అగ్రిమెంట్ ప్రకారం వరలక్ష్మి, నాగమణికే భూమి చెందుతుందని పోలీసులు చెప్పారు. అయితే అప్పటికి సమస్య సద్దుమణిగింది.
చంద్రబాబు ప్రభుత్వం రాగానే...
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే మోహన్‌రెడ్డి టీడీపీ నేతలను ఆశ్రయించడం, వారి సూచన మేరకు రామచంద్రారెడ్డి, లక్ష్మీరెడ్డిలను భూమిలోకి రాకుండా అడ్డుకున్నారు. రామచంద్రారెడ్డి వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ కావడంతో పోలీసుస్టేషన్, తహసీల్దార్ కార్యాలయాల్లో ఆయన వాదనను పరిగణంలోకి తీసుకోలేదు.
ఆధారాలుంటే ఇవ్వండి..
ఈ భూమి మీదే అనడానికి ఆధారాలుంటే తీసుకురావాలని మండల రెవెన్యూ అధికారులు గత ఏడాది నవంబర్‌లో నోటీసులు జారీ చేశారు. దీంతో రామచంద్రారెడ్డి, లక్ష్మీరెడ్డి పట్టా, సాగులో ఉన్నట్లు, ఆన్‌లైన్‌లో భూ వివరాల పత్రాలన్నింటిని రెవెన్యూ అధికారులకు అందజేశారు. రెవెన్యూ ఉన్నతాధికారులకు ఒత్తిళ్లు రావడంతో కింద స్థాయి అధికారులతో తప్పుడు నివేదికలను తయారు చేయించారు. జనవరి 29న అవి ఫేక్ డాక్యుమెంట్లు అని చెబుతూనే 30 రోజుల్లో ఆర్డీఓకి అప్పీల్ చేసుకోవాలని నోటీసులు జారీ చేశారు.
హైకోర్టును ఆశ్రయించిన బాధితులు..
బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు ఫిబ్రవరి 5న స్టేటస్ కో (యథాస్థితి) ఉత్తర్వులు ఇచ్చింది. అయినప్పటికీ ఆర్డీఓ ఆ ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ 6న ఆ భూమిని డిస్ప్యూట్‌లో పెట్టారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో ఆర్డీఓ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని, దీనిపై మళ్లీ కోర్టుకు వెళతామని బాధితులు బైరెడ్డి రామచంద్రారరెడ్డి, లక్ష్మిరెడ్డి చెబుతున్నారు.
అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గిన ఆర్డీఓ
ఫిబ్రవరి 5న స్టేటస్ కో ఆర్డర్ ఇచ్చిన హైకోర్టు
6న డిస్ప్యూట్ ఆర్డర్ ఇచ్చిన ఆర్డీఓ
వైఎస్సార్‌సీపీ కూడేరు మండల కన్వీనర్
రామచంద్రారెడ్డిని ఇబ్బంది పెడుతున్న వైనం
హైకోర్టు ఆదేశాలు బేఖాతరు
హైకోర్టు ఆదేశాలు బేఖాతరు


