గుట్టుగా ఆలయ ఆభరణాల అప్పగింత
రాయదుర్గం: ప్రసిద్ధ క్షేత్రమైన నేమకల్లు ఆంజనేయస్వామి ఆభరణాల లెక్కల విషయంలోనూ స్పష్టత కొరవడింది. ‘దేవుడి సొత్తు భద్రమేనా?’ అనే కథనం గత నెల ఫిబ్రవరి 26న ‘సాక్షి’ లో ప్రచురితమైంది. దీనికి రాష్ట్ర, జిల్లా దేవదాయశాఖ అధికారులు స్పందించారు. వారి ఆదేశాల మేరకు బదిలీపై వెళ్లిన ఈఓ శ్రీనివాసులు మూడేళ్ల తర్వాత మూడు రోజుల క్రితం ఆగమేఘాలపై అంజన్న ఆలయం వద్దకు చేరుకున్నారు. ప్రస్తుత ఈఓ నరసింహరెడ్డి, మరికొందరితో కార్యాలయంలో చర్చలు జరిపారు. భక్తులు, గ్రామస్తుల సమక్షంలో కాకుండా గుట్టుగా సర్దుబాటు జరపడం విమర్శలకు దారి తీసింది. దేవుడి సొత్తు ఉండేది ఎంత.. అప్పగించింది ఎంత.. పెండింగ్ సొమ్ము ఎంత.. స్వాధీనం చేసుకోవాల్సింది ఎంతో అందరికీ తెలియజేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. సొమ్మంతా లాకర్‌లోనే భద్రపరిచారా? లేక బయటకు వెళ్లిందా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై కలెక్టర్ విచారణ జరిపించాలని కోరుతున్నారు. దీనిపై దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జునను ‘సాక్షి’ వివరణ కోరగా.. ‘నేమకల్లు ఆభరణాలు సత్వరం స్వాధీనం చేయాలని బదిలీపై వెళ్లిన ఈఓ శ్రీనివాసులకు ఆదేశించాం. ఆయన మూడు రోజుల క్రితం ఆలయం వద్దకు చేరుకుని ఈఓ నరసింహారెడ్డికి కొన్ని ఆభరణాలు అప్పగించారు. ఇంకా ఆభరణాలు ఇవ్వాల్సి ఉంది. ఒకటి రెండు రోజుల్లో వాటిని స్వాధీనం చేయాలని ఆదేశించాం. లెక్కల్లో తేడా వస్తే కఠిన చర్యలు తీసుకుంటాం’ అన్నారు.
గోప్యతపై ప్రజల అనుమానం
గుట్టుగా ఆలయ ఆభరణాల అప్పగింత


