ఫ్రీహోల్డ్ భూములకు గ్రహణం
● యాజమాన్య హక్కుల కల్పనపై తేల్చని ప్రభుత్వం
● పరిశీలన పేరుతో 20 నెలలుగా సాగదీత
అనంతపురం అర్బన్: అసైన్డ్ భూముల రైతులకు యాజమాన్య హక్కులు కల్పించే విషయంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్దయగా వ్యవహరిస్తోంది. పరిశీలన పేరుతో 20 నెలలుగా సాగదీస్తూ రైతుల సహనాన్ని పరీక్షిస్తోంది. 2003కు ముందు అసైన్డ్ అయిన భూములకు యాజమాన్య హక్కు కల్పించేందుకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో చర్యలు చేపట్టారు. జిల్లావ్యాప్తంగా 563 గ్రామాల్లో 2003కు ముందు 96 వేల మంది రైతులకు అసైన్డ్ చేసిన భూములు 3,03,370.55 ఎకరాలు. ఇందులో 1954 జూన్ 18 ముందు వాటిని, 22ఏ జాబితా, చుక్కల భూముల జాబితాలో ఉన్న వాటికి కాకుండా మిగిలిన అసైన్డ్ భూములు ఫ్రీహోల్డ్ చేసి యాజమాన్య హక్కులు కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు. తొలి విడతగా 114 గ్రామాల్లో అసైన్డ్ భూములు ఫ్రీహోల్డ్ ప్రక్రియ నిర్వహించారు. ఇందుకు సంబంధించి 36 వేల ఎకరాల భూములను ఫ్రీహోల్డ్‌కు సిద్ధం చేశారు. అయితే చంద్రబాబు సారథ్యంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భూములను ఫ్రీ హోల్డ్ చేసి యాజమాన్య హక్కు కల్పించే కార్యక్రమాన్ని నిలిపివేసి.. పరిశీలనకు ఆదేశించింది. దీంతో తహసీల్దార్ స్థాయి నుంచి ఆర్డీఓ స్థాయి వరకు మరోమారు పరిశీలన చేసి 36,659 ఎకరాల్లో 26,132 ఎకరాలు చట్టబద్ధంగా ఉన్నట్లు గుర్తించారు. మిగిలినవి పునఃపరిశీలన చేయాల్సి ఉందని ప్రభుత్వానికి నివేదించారు. గుర్తించిన 26 వేల ఎకరాల భూములకు యాజమాన్య హక్కులు కల్పించే విషయంలో ఎటూ తేల్చకుండా సాగదీస్తూ వస్తోంది. ఇక ఫ్రీహోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లు చేయవద్దంటూ రిజిస్ట్రేషన్‌శాఖకు ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో రైతుల పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. చివరికి అసైనీదారు చనిపోతే వారసులు మ్యుటేషన్ కూడా చేసుకోలేని దుస్థితి నెలకొంది.
ఫ్రీహోల్డ్ భూములకు గ్రహణం
ఫ్రీహోల్డ్ భూములకు గ్రహణం


