టీడీపీ నేతల జగడం | - | Sakshi
Sakshi News home page

టీడీపీ నేతల జగడం

Mar 1 2026 7:48 AM | Updated on Mar 1 2026 7:48 AM

టీడీపీ నేతల జగడం

టీడీపీ నేతల జగడం

శింగనమల: టీడీపీ నేతల కుమ్ములాట కారణంగా ఓ గిరిజన గ్రామంలో అభివృద్ధి పనులు ఆగిపోయాయి. పోలీసులు, పంచాయతీ రాజ్‌ అధికారుల సమక్షంలోనే తీవ్ర స్థాయిలో వాగ్వాదానికి దిగిన టీడీపీ నేతలు చివరకు సాయంత్రం ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ ఇంటి వద్ద పంచాయితీకి కూర్చొదమంటూ నిర్ణయించుకున్నారు. వివరాల్లోకి వెళితే... మూడేళ్ల క్రితం శింగనమల మండలం నాగులగుడ్డం తండా పంచాయతీని ప్రధాన మంత్రి ధర్తి అభజన జాతీయ ఉత్కర్ష అభియాన్‌ కింద కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. దీంతో పంచాయతీ పరిధిలో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.48 లక్షలు, తాగునీటి పైప్‌లైన్‌ ఏర్పాటుకు రూ.25 లక్షలు, పంచాయతీ భవనం నిర్మాణానికి రూ.35 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఈ పనులు చేపట్టే విషయంలో టీడీపీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయి రెండేళ్లుగా ఘర్షణ పడుతూ వస్తున్నారు. దీంతో పనులు ముందుకు సాగడం లేదు. ఈ క్రమంలో రూ.48 లక్షలతో మంజూరైన సీసీ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభించేందుకు శనివారం పంచాయతీరాజ్‌ డీఈ జ్యోతి, మండల ఇన్‌చార్జ్‌ ఇంజనీర్‌ అనిల్‌కుమార్‌రెడ్డి నాగులగుడ్డం తండాకు చేరుకున్నారు. స్థానికులతో కలసి సీసీ రోడ్డు పనులు ప్రారంభించారు. విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు అక్కడకు చేరుకుని తీవ్ర స్థాయిలో ఘర్షణ పడ్డారు. పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీస్తుండడంతో సమాచారం అందుకున్న సీఐ కౌలుట్లయ్య, ఏఎస్‌ఐ చితంబరి, సిబ్బంది అక్కడకు చేరుకుని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. పనులు తమకు కేటాయించారంటే తమకు కేటాయించారని అధికారుల ముందే టీడీపీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయి వాగ్వాదానికి దిగారు. ఆ సమయంలో ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు. అయినా గొడవ ఆగలేదు. పీఆర్‌ డీఈ సర్దిచెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. నిధులు మురిగిపోకుండా ఉండేందుకు సిబ్బందితో పనులు పూర్తి చేయిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు సహకరించాలని అభ్యర్థించారు. అయినా టీడీపీ నేతల్లో మార్పు రాలేదు. చివరకు ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ ఇంటి వద్ద సాయంత్రం పంచాయితీ ఏర్పాటు చేసి తేల్చుకుంటామని, అప్పటి వరకూ పనులు సాగిస్తే పరిస్థితి మరో రకంగా ఉంటుందంటూ అధికారులను హెచ్చరించి వెళ్లిపోయారు. దీంతో పనులను అధికారులు ఆపేశారు.

సీసీ రోడ్డు పనులు చేపట్టకుండా అధికారులను అడ్డుకున్న వైనం

పంచాయతీ రాజ్‌ డీఈ, సీఐతో వాగ్వాదం

సాయంత్రం ఎమ్మెల్యే వద్ద పంచాయితీ చేసుకుందామని నిర్ణయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement