క్షణికావేశం అనాథలను చేసింది!
● కుటుంబ కలహాల నేపథ్యంలో వివాహిత ఆత్మహత్య
● దిక్కుతోచని స్థితిలో ఇద్దరు చిన్నారులు
పుట్టపర్తి అర్బన్: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. దీంతో అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులు దిక్కులేని వారయ్యారు. కుటుంబసభ్యులు తెలిపిన మేరకు... పుట్టపర్తి మండలం పెడపల్లికి చెందిన నరసన్న కుమారుడు జగదీష్‌కు గతంలో ఉమాదేవి అనే యువతితో వివాహమైంది. ఫొటోస్టూడియో నిర్వహిస్తూ జీవనం సాగించేవాడు. ఈ క్రమంలో దంపతుల మధ్య చోటు చేసుకున్న మనస్పర్థల కారణంగా ఏడేళ్ల క్రితం ఇంట్లో ఉమాదేవి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అనంతరం ఐదేళ్ల క్రితం పుట్టపర్తి మండలం బత్తలపల్లి గ్రామానికి చెందిన గౌరమ్మ పెద్ద కుమార్తె చంద్రకళ (22)ను జగదీష్ రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి నాలుగేళ్ల వయసున్న కుమార్తె, రెండున్నర సంవత్సరాల వయసున్న కుమారుడు ఉన్నారు. వీరి సంసారంలోనూ కలతలు చెలరేగాయి. తరచూ దంపతుల మధ్య గొడవలు చోటు చేసుకునేవి. శుక్రవారం రాత్రి సైతం ఇద్దరూ గొడవ పడ్డారు. ఆ సమయంలో క్షణికావేశానికి లోనైన చంద్రకళ... ఇంట్లో అందరూ నిద్రిస్తుండగా గతంలో జగదీష్ మొదటి భార్య ఉరి వేసుకున్న గదిలోనే తాను కూడా ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. శనివారం ఉదయం విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకుని దిక్కుతోచని స్థితిలో అమాయకంగా చూస్తుండిపోయిన ఇద్దరు చిన్నారులను చూస్తూ అయ్యో పాపమంటూ కంటి తడిపెట్టారు. ఇదిలా ఉండగా తన కుమార్తె మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ చంద్రకళ తల్లి గౌరమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదనపు కట్నం కోసం వేధించేవాడని, అల్లుడే తన కుమార్తెను కొట్టి చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడంటూ కన్నీటిపర్యంతమైంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
క్షణికావేశం అనాథలను చేసింది!


