మామిడి తోట దగ్ధం
బొమ్మనహళ్: నిప్పు రాజేయడంతో మంటలు చెలరేగి బొమ్మనహాళ్ మండలం ఉంతకల్లులో రైతు సురేంద్రబాబుకు చెందిన మామిడి తోట దగ్ధమైంది. శనివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. బాధిత రైతు తెలిపిన మేరకు... తన పక్క పొలం గట్టుపై ఉన్న ఎండుగడ్డికి ఆ పొలం యజమాని శనివారం నిప్పు పెట్టాడు. దీంతో మంటలు చెలరేగి సురేంద్రబాబు మామిడి తోటను చుట్టుముట్టాయి. రెండేళ్లుగా దిగుబడి వస్తోందని, ప్రస్తుతం పూత, పిందె దశలో ఉన్న376 మామిడి చెట్లు కాలిపోవడంతో రూ.10లక్షల మేర నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు వాపోయాడు. అధికారులు పరిశీలించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశాడు.
వివాహిత ఆత్మహత్య
కళ్యాణదుర్గం రూరల్: మండలంలోని గూబనపల్లికి చెందిన శిల్ప (30) ఆత్మహత్య చేసుకుంది. ఆమెకు భర్త రాజు, ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. కొంతకాలంగా మానసిక స్థితి సరిగా లేకపోవడంతో ఆస్పత్రిలో చికిత్స పొంది ఇంట్లోనే విశాంత్రి తీసుకుంటోంది. ఈ క్రమంలో శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
పింఛన్ల పంపిణీలో కలెక్టర్
రాప్తాడు రూరల్: అనంతపురం రూరల్ పరిధిలోని ఉప్పరపల్లిలో శనివారం లబ్ధిదారుల ఇంటి వద్దకే కలెక్టర్ ఆనంద్ వెళ్లి సామాజిక భద్రతా పింఛన్లను పంపిణీ చేశారు. ప్రతి నెలా పింఛన్ల పంపిణీ ఎలా జరుగుతోందంటూ లబ్దిదారులతో ఆరా తీశారు. ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని అన్నారు. అనంతరం యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేను పరిశీలించారు. తహసీల్దార్ మోహన్ కుమార్, ఎంపీడీఓ దివాకర్, గ్రామ సర్పంచ్ సావిత్రి, ఎంపీటీసీ సభ్యురాలు నాగలక్ష్మమ్మ, ఆర్‌ఐ సందీప్, మండల సర్వేయర్ రఘు, సచివాలయ సిబ్బంది ఉన్నారు.


