జనగణనపై 3న శిక్షణ
● పటిష్ట ఏర్పాట్లకు డీఆర్వో ఆదేశం
అనంతపురం అర్బన్: జిల్లాలో జనగణన–2027 తొలిదశ (ఇళ్ల జాబితా, గృహ గణన – హెచ్‌ఎల్‌ఓ) శిక్షణ కార్యక్రమం మార్చి 3 నుంచి 5 వరకు నిర్వహించనున్నారు. కలెక్టర్, ప్రిన్సిపల్ సెన్సస్ అధికారి ఆనంద్ ఉత్తర్వుల మేరకు చార్జ్ ఆఫీసర్లకు జేఎన్‌టీయూ ఈసీఈ, ఈఈఈ బ్లాక్‌లు, కంప్యూటర్ ల్యాబ్‌లలో నిర్వహించే శిక్షణకు ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని డీఆర్‌ఓ మలోల ఆదేశించారు. జనగణన–2027పై డీఆర్‌ఓ శుక్రవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా దాదాపు 200 మంది అధికారులు శిక్షణలో పాల్గొంటారన్నారు. శిక్షణ విజయవంతం కోసం వేదిక, బ్యాక్‌డ్రాప్, సాంకేతిక ఏర్పాట్లు, పరిశుభ్రత, భోజన వసతి, ప్రచార ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జనగణన విధులు అత్యంత క్రియాశీలకంగా, బాధ్యతాయుతంగా ఉంటాయని పేర్కొన్నారు. చార్జ్ అధికారులందరూ తప్పనిసరిగా శిక్షణకు హాజరవ్వాలన్నారు. అనంతరం డీఆర్‌ఓ అధికారులతో కలిసి జేఎన్‌టీయూలో శిక్షణకు ఎంపిక చేసిన బ్లాక్‌లను సందర్శించారు. కార్యక్రమంలో సీపీఓ అశోక్‌కుమార్, ఆర్డీఓ కేశవనాయుడు, డీఎస్‌ఓ వెంకటేశ్వర్లు, పౌర సరఫరాల సంస్థ డీఎం రమేష్‌రెడ్డి, డీఐపీఆర్‌ఓ బాలకొండయ్య, తహసీల్దార్ మోహన్‌కుమార్, కో–ఆర్డినేషన్ సూపరింటెండెంట్ యుగేశ్వరిదేవి, తహసీల్దార్ హరికుమార్, గణాంక అధికారి గిరి, ఎన్నికల విభాగం డీటీ కనకరాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు.


