‘పచ్చ’ రంగుతో దోపిడీకి కుట్ర
బుక్కరాయసముద్రం: ప్రజాధనం కొల్లగొట్టేందుకు అధికార పార్టీలో పోటీపడుతున్నారు. ఈ క్రమంలో ఓ కార్యకర్త దశాబ్దం కిందట జరిగిన పనులకు ఇప్పుడు బిల్లు పెట్టుకునేందుకు చేసిన ప్రయత్నం చర్చనీయాంశంగా మారింది. బుక్కరాయసముద్రం మండలం నీలాంపల్లిలో 2017లో అప్పటి టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి రూ.5లక్షల వ్యయంతో నాగలింగేశ్వర దేవాలయం వద్ద బోరు వేయించి, వాటర్ ట్యాంకు కట్టించారు. ఆ తర్వాత వాటిని వినియోగంలోకి తేలేదు. మళ్లీ రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరడంతో.. మరోమారు బిల్లు చేసుకునేందుకు టీడీపీలోని పుల్లయ్య వర్గం భావించింది. ఈ మేరకు 2025–2026 ఆర్థిక సంవత్సరానికిగాను ఎంపీ ల్యాడ్స్ కింద రూ.8లక్షల అంచనా వ్యయంతో తాగునీటి పైపులైను పని చేసినట్లుగా హడావుడి చేసింది. మార్చి మూడో తేదీన అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ చేతుల మీదుగా ట్యాంకు రూము ప్రారంభోత్సవానికి సిద్ధం చేసింది. విషయం తెలుసుకున్న టీడీపీలోని మరోవర్గానికి చెందిన నాగలింగ ఇదేమిటని ప్రశ్నించాడు. దీంతో శుక్రవారం ఉదయం ఇరువర్గాల వారూ ఘర్షణపడ్డారు. అనంతరం పుల్లయ్యవర్గం వారు తమపై దౌర్జన్యం చేస్తూ.. చంపుతామని బెదిరిస్తున్నారని నాగలింగ పోలీసులకు ఫిర్యాదు చేశారు.


