సమస్యలు పట్టని సర్కార్‌ | - | Sakshi
Sakshi News home page

సమస్యలు పట్టని సర్కార్‌

Feb 28 2026 7:26 AM | Updated on Feb 28 2026 7:26 AM

సమస్యలు పట్టని సర్కార్‌

సమస్యలు పట్టని సర్కార్‌

పని మాది.. అవార్డులు మీకా?

కనీస వేతనం రూ.24,500 ఇవ్వాలి

డీసీఎం మాస్క్‌ ధరించి కలెక్టరేట్‌ ఎదుట పంచాయతీ కార్మికుల ధర్నా

అనంతపురం అర్బన్‌: ‘మాతో పనిచేయించుకోవడం తప్ప మా సమస్యలు పట్టవా? పని మేము చేస్తే.. అవార్డులు మీరు అందుకున్నారే, అప్పుడైనా మా సమస్యలు మీకు గుర్తుకు రాలేదా’ అంటూ చంద్రబాబు ప్రభుత్వాన్ని పంచాయతీ పారిశుధ్య కార్మికులు నిలదీశారు. కార్మికుల ప్రయోజనాలను విస్మరిస్తున్నారంటూ ఏపీ గ్రామ పంచాయతీ కార్మిక సంఘం నాయకులు ధ్వజమెత్తారు. సమస్యల పరిష్కారం కోరుతూ ఏపీ గ్రామ పంచాయతీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్‌ ఎదుట పంచాయతీ పారిశుధ్య కార్మికులు ధర్నా చేపట్టారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌ మాస్క్‌లు ధరించి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. సంఘం అధ్యక్షుడు మధు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గౌరవాధ్యక్షుడు గోపాల్‌, ప్రధాన కార్యదర్శి శివప్రసాద్‌ మాట్లాడారు. కొన్ని పంచాయతీల్లో పారిశుధ్య కార్మికులకు కొన్ని నెలలుగా వేతనం ఇవ్వడం లేదన్నారు. సమస్యలు పరిష్కరిస్తామంటూ హామీనిచ్చిన ఉప ముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పవన్‌కళ్యాణ్‌ కనీసంగా కార్మికుల సమస్యలను పట్టించుకోలేదని మండిపడ్డారు. పంచాయతీ కార్మికుల సంక్షేమానికి బడ్జెట్‌లో కనీస నిధులు కూడా కేటాయించలేదన్నారు. మునిసిపల్‌ కార్మికులకు చెల్లిస్తున్న విధంగా పంచాయతీ కార్మికులకూ ప్రతి నెలా 5వ తేదీన రూ.21 వేల నుంచి రూ.24,500 జీతం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. బకాయి వేతనాలు తక్షణమే మంజూరు చేయాలన్నారు. పీఎఫ్‌, ఈఎస్‌ఐ, గ్రాట్యూటీ, పెన్షన్‌, సెలవులు అమలు చేయాలన్నారు. కార్మికులు మరణిస్తే దహన సంస్కారాలకు రూ.20 వేలు ఇవాలన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం స్వచ్ఛభారత్‌ కార్మికులకు రూ.10 వేలు వేతనం ఇవాలన్నారు. సాధారణ మృతికి రూ.5 లక్షలు, ప్రమాద మృతికి రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అనంతరం డీఆర్‌ఓ ఎ.మలోలకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ ఉపాధ్యక్షుడు రామాంజనేయులు, సంఘం రాష్ట్ర నాయకురాళ్లు కుళ్లాయమ్మ, వెంకటమ్మ, జిల్లా నాయకులు పెద్దన్న, నూర్‌బాషా, ఆది, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement