పీఆర్సీని తక్షణమే ప్రకటించాలి
● ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ డిమాండ్
అనంతపురం ఎడ్యుకేషన్: అనేక హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులను వంచిస్తోందని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్) జిల్లా అధ్యక్షుడు నరేష్‌కుమార్ ధ్వజమెత్తారు. ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఏపీటీఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం తాలూకా కేంద్రాల వద్ద ధర్నాలు జరిగాయి. ఇందులో భాగంగా అనంతపురం తహసీల్దార్ కార్యాలయం ఎదుట చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు నరేష్‌కుమార్ మాట్లాడారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లకు సంబంధించి పీఆర్సీని తక్షణమే ప్రకటించాలన్నారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ముఖ్యమంత్రి హోదాలో సీపీఎస్ రద్దుపై చంద్రబాబు మాట్లాడకపోవడం ఉద్యోగులను దగా చేయడమేనన్నారు. 2023 జూలై నుంచి 12వ పీఆర్సీ అమలు కావాల్సి ఉండగా 30 నెలలు దాటినా నేటికీ కనీసం పీఆర్సీని ప్రకటించకపోవడం సిగ్గుచేటన్నారు. 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని డిమాండ్ చేశారు. ధరల ఇండెక్స్ ప్రకారం ఆర్నెళ్లకోసారి కేంద్ర ప్రభుత్వ దామాషా ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కరువు భత్యాన్ని విడుదల చేయాలన్నారు. అనంతరం డిప్యూటీ తహసీల్దారుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్ జిల్లా కార్యదర్శులు రామకృష్ణ, సూరి, రంగనాయకులు, రాష్ట్ర కౌన్సిలర్లు సోమిరెడ్డి, శివారెడ్డి, మదన్, ఓబులేసు, యల్లప్ప, ఆడిట్ కన్వీనరు లక్ష్మీనారాయణ, జీఓ కమిటీ సభ్యులు గురురాజ, సీనియర్ నాయకులు నాగేంద్రప్రసాద్, నాగరాజు పాల్గొన్నారు.


