గందరగోళాన్ని సవరించాలి : ఏపీటీఎఫ్
అనంతపురం ఎడ్యుకేషన్: పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు అమలు చేస్తున్న ‘ఇన్విజిలేషన్ ఆటోమేషన్’ విధానంలో నెలకొన్న తీవ్ర గందరగోళాన్ని వెంటనే సవరించాలని ఏపీటీఎఫ్ (1938) నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం డీఈఓ కార్యాలయ ఏడీ మునీర్‌ఖాన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. స్కూల్ అసిస్టెంట్, గ్రేడ్ 2 హెడ్మాస్టర్లను 50 నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న పరీక్ష కేంద్రాలకు సీఎస్, డీఓలుగా నియమించారన్నారు. వాటిని రద్దు చేసి సమీపంలోని పరీక్ష కేంద్రాలు కేటాయించాలన్నారు. సీనియర్లకు డీఓలుగా, జూనియర్లకు సీఎస్‌లుగా విధులు కేటాయించారని, ఇందులో సర్వీసులో ఇప్పటి వరకూ ఇన్విజిలేషన్ విధులు కూడా చేయని స్కూల్ అసిస్టెంట్లకు డీఓలుగా కేటాయించడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. వారికి ఆ విధుల నుంచి మినహాయింపు ఇచ్చి విల్లింగ్ ఉన్న వారికి కేటాయించాలన్నారు. ఏడీని కలిసిన వారిలో ఏపీటీఎఫ్ (1938) జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శ్రీనివాసరెడ్డి, శ్రీనివాసనాయక్, రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ రఫీ, జిల్లా పూర్వ అధ్యక్షుడు రవీంద్ర, జిల్లా నాయకులు పోతులయ్య, ఆంజనేయులు నాయక్, తిరుపాల్ నాయక్, సురేష్, ఫకృద్దీన్, గోవిందరెడ్డి, ఇలియాజర్ ఉన్నారు.
యువకుడి హత్య
విడపనకల్లు: కర్ణాటక ప్రాంతానికి చెందిన ఓ యువకుడు విడపనకల్లు మండలం డొన్నేకల్లు గ్రామ శివారులో దారుణ హత్యకు గురయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. అక్కడి ఆనవాళ్లను బట్టి బండరాళ్లతో కొట్టి హత్య చేసినట్లుగా నిర్ధారించారు. గురువారం మధ్య రాత్రి ఘటన జరిగి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. మృతదేహానికి సమీపంలోనే కర్ణాటక రిజిస్ట్రేషన్ కలిగిన ఓ స్కూటీ పడి ఉండడంతో దాని ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు హతుడిని రాయచూరు జిల్లా సింధనూరు గ్రామానికి చెందిన కిరణ్‌కుమార్ (38)గా గుర్తించారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
గందరగోళాన్ని సవరించాలి : ఏపీటీఎఫ్


