శెట్టూరు: మండలంలోని బసంపల్లి గ్రామంలో పట్టపగలే ఎలుగుబంటి కనిపించింది. గురువారం రైతులు పొలానికి వెళుతుండగా పొదల్లో నుంచి ఉన్నఫళంగా ఎలుగుబంటి బయటకు వచ్చింది. గమనించిన రైతులు గట్టిగా కేకలు వేయడంతో అది పొలాల్లోకి పరుగు తీసింది. గ్రామ శివారు ప్రాంతంలో పట్టపగలే ఎలుగుబంటి కనిపించడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. అటవీ అధికారులు స్పందించి ఎలుగుబంటిని బంధించాలని కోరారు.
గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి
అనంతపురం సెంట్రల్: నగరంలోని మూడో పట్టణ పీఎస్ కానిస్టేబుల్ నజీరుద్దీన్ (పీసీ 1804) గుండెపోటుతో మృతి చెందారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. సుదీర్ఘకాలం సీఐడీ విభాగంలో పనిచేసిన ఆయన ఇటీవల త్రీటౌన్ పోలీసుస్టేషన్‌కు బదిలీపై వచ్చారు. గురువారం మధ్యాహ్నం రాజీవ్‌కాలనీలోని తన నివాసంలో కళ్లు తిరిగి పడిపోవడంతో కుటుంబసభ్యులు వెంటనే ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
మద్యం మత్తులో వ్యక్తి వీరంగం
అనంతపురం సెంట్రల్: మద్యం మత్తులో ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. ఏకంగా పోలీసు వాహనంపై దాడి చేయడంతో అద్దం ధ్వంసమైంది. ఈ ఘటన బుధవారం రాత్రి అనంతపురంలోని పాతూరు రాణినగర్‌లో చోటు చేసుకుంది. వన్‌టౌన్ సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన మేరకు... రాణినగర్‌లో నివాసముంటున్న బళ్లారి బాబామౌలానా బుధవారం రాత్రి మద్యం మత్తులో తన భార్యపై కొడుతున్నట్లుగా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రక్షక్ వాహనంలో అక్కడకు చేరుకున్నారు. అప్పటికే ఆ ప్రాంతంలో నానా హంగామా చేస్తున్న బాబా ఏకంగా పోలీసులపై తిరగబడ్డాడు. రక్షక్ వాహనం అద్దాన్ని గుద్దడంతో పగిలిపోయింది. అంతకు ముందు అటుగా వెళుతున్న రామప్పపై దాడి చేసి సెల్‌ఫోన్ లాక్కొన్నాడు. ఓ మహిళను వెంబడించి భయభ్రాంతుల కు గురి చేయడంతో ఆమె కిందపడింది. బుధవారం రాత్రి పారిపోయిన నిందితుడిని గురువారం అరెస్ట్ చేసినట్లు పోలీసులు అరెస్ట్ చేశారు.


