కౌలు రైతులను ఆదుకోవాలి
● రైతు సంఘం నాయకుల డిమాండ్
అనంతపురం అర్బన్: కౌలు రైతులకూ అన్నదాత సుఖీభవ కింద రూ.20వేలు పెట్టుబడి సాయం అందించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కౌలు రైతు, రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. డిమాండ్ సాధనలో భాగంగా సోమవారం కలెక్టరేట్ ఎదుట 30 గంటల దీక్ష చేపట్టారు. కౌలు రైతు సంఘం అధ్యక్షుడు రంగారెడ్డి అధ్యక్షత వహించారు. కౌలు రైతు సంఘం, రైతు సంఘం, పండ్లతోటల రైతు సంఘం జిల్లా కార్యదర్శులు బాలరంగయ్య, చంద్రశేఖర్‌రెడ్డి, శివారెడ్డి మాట్లాడారు. సాగు చేస్తున్న పంట దెబ్బతిన్నా, గిట్టుబాటు ధర లేకపోయినా కౌలు రైతులు పెద్ద ఎత్తున నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి వీరికి ఎలాంటి పరిహారం, పెట్టుబడిసాయం అందక అప్పులు పాలవుతున్నారన్నారు. ప్రస్తుతం ఉన్న నిబంధనలు సడలించి కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని, రూ.2 లక్షల వరకు పంట రుణాలు ఇవ్వాలని, పంటల బీమా అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ ఆనంద్‌ను కలసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బీహెచ్ రాయుడు, సీపీఎం నగర కార్యదర్శి రామిరెడ్డి, నాయకులు రామాంజనేయులు, జయచంద్రారెడ్డి, నాగిరెడ్డి, వెంకటేష్, పోతులయ్య, సుబ్బిరెడ్డి పాల్గొన్నారు.


