రికార్డు స్థాయిలో ‘రచ్చబండ’
కళ్యాణదుర్గం: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో ఆదివారం కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త తలారి రంగయ్య ఆధ్వర్యంలో ఐదు మండలాలు 74 పంచాయతీల పరిధిలోని 104 గ్రామాలను కదిలిస్తూ ‘జనం మాట – జగనన్న బాట’ రచ్చబండ కార్యక్రమం నిర్వహించడం పార్టీలో కొత్త ఉత్సాహం నింపింది. రాష్ట్రంలోనే మొట్టమొదటి సారిగా ‘జూమ్ మీటింగ్’ ద్వారా ఒకేసారి 74 పంచాయతీల నాయకులు, కార్యకర్తలు రచ్చబండ నిర్వహించి సరికొత్త రికార్డు సృష్టించారు. బ్రహ్మసముద్రం మండలం నాగిరెడ్డిపల్లిలో జరిగిన ‘రచ్చబండ’లో సమన్వయకర్త డాక్టర్ తలారి రంగయ్యతో పాటు పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వజ్ర భాస్కర్‌రెడ్డి, సీఈసీ సభ్యుడు మాదినేని ఉమా మహేశ్వర నాయుడు, నియోజకవర్గ అబ్జర్వర్ మహేందర్‌రెడ్డి, మండల కన్వీనర్ చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గ్రామంలోని ప్రజా సమస్యలు, మౌలిక సదుపాయాల కల్పన, ప్రాంతీయ అభివృద్ధిపై నాయకులు సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా ప్రతి పంచాయతీ నుంచి రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను త్వరతగతిన పూర్తి చేసి రాయలసీమకు శాశ్వతంగా సాగు, తాగునీరు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తీర్మానాలు చేశారు. దీంతో పాటు పేదల సంక్షేమం కోసం పనిచేస్తున్న ఆర్డీటీకి అవసరమైన ఎఫ్‌సీఆర్‌ఏ లైసెన్స్ పునరుద్ధరణ చేయాలని, ఉపాధి హామీ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, కళ్యాణదుర్గం నియోజకవర్గానికి జీవనాడి అయిన జీడిపల్లి– భైరవానితిప్ప ప్రాజెక్టు ద్వారా స్థానిక గ్రామాలలో చెరువులు, కుంటలను నింపి సాగు – తాగునీటి సమస్య తీర్చాలని తీర్మానంలో పొందుపరిచారు. అన్ని గ్రామ పంచాయతీల నుంచి తీర్మాన ప్రతులను నేరుగా వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయానికి యాప్ ద్వారా అప్‌లోడ్ చేశారు.
గర్వంగా ఉంది
కళ్యాణదుర్గం నియోజకవర్గంలో రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా వినూత్నంగా జూమ్ మీటింగ్ ద్వారా 74 పంచాయతీల నాయకులు, కార్యకర్తలను కలుపుకుని సమావేశం కావడం చాలా గర్వంగా ఉంది. ప్రతి పంచాయతీలో అనుకున్న దానికంటే అతి తక్కువ సమయంలో అధికమంది పాల్గొనడం సంతోషకరం. రాబోవు రోజుల్లో ప్రత్యక్ష కార్యక్రమాలు సైతం మరింత విజయవంతంగా చేసేందుకు సమష్టిగా కృషి చేస్తాం.
– డాక్టర్ తలారి రంగయ్య, వైఎస్సార్‌సీపీ
కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త
ఒకేసారి 74 పంచాయతీల్లో
‘జనం మాట – జగనన్న బాట’
అన్ని పంచాయతీల్లోనూ
అనూహ్య స్పందన
రాష్ట్రంలోనే కళ్యాణదుర్గం
నియోజకవర్గం టాప్
రికార్డు స్థాయిలో ‘రచ్చబండ’


