నేడు కలెక్టరేట్‌లో ‘పరిష్కార వేదిక’
అనంతపురం అర్బన్: కలెక్టరేట్ రెవెన్యూ భవన్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరిష్కార వేదికలో ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో అధికారులకు సమర్పిస్తే.. పరిశీలించి, పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. భూ సమస్యలు ఉన్నవారు రెవెన్యూ క్లినిక్‌లో తహసీల్దార్లకు అర్జీలు అందజేయాలని సూచించారు. అర్జీ పరిష్కార స్థితిని కాల్‌సెంటర్ 1100కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చన్నారు. పరిష్కార వేదికలోనే కాకుండా meekosam.ap.gov.in లోనూ అర్జీ సమర్పించవచ్చని పేర్కొన్నారు.
నేడు డయల్ యువర్
ఎస్పీడీసీఎల్ సీఎండీ
అనంతపురం టౌన్: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు డయల్ యువర్ సీఎండీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు సీఎండీ శివశంకర్ లోతేటి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ వినియోగదారులు సమస్యలను 89777 16661 నంబరుకు ఫోన్ చేసి తెలియజేయాలని సూచించారు. దీంతో పాటు డయల్ యువర్ ఎస్‌ఈ కార్యక్రమంలో భాగంగా 91547 90350కు ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు ఫోన్ చేసి సమస్యలను తెలపాలన్నారు. ఈ అవకాశాన్ని విద్యుత్ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి
అనంతపురం అర్బన్: బ్రిటీష్ వలస పాలనకు వ్యతిరేకంగా జరిగిన ప్రజా తిరుగుబాటుకు నాయకత్వం వహించిన యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని డీఆర్‌ఓ మలోల అన్నారు. ఆన్‌సెట్, జిల్లా పర్యాటక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి నిర్వహించారు. డీఆర్‌ఓ ముఖ్య అతిథిగా హాజరై నరసింహారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అమలు చేసిన కఠినమైన భూస్వామ్య, రెవెన్యూ విధానాలను నరసింహారెడ్డి అప్పట్లో తీవ్రంగా వ్యతిరేకించారన్నారు. రైత్వారీ విధానం అమలు, ఇనాం, కట్టుబడి భూముల స్వాధీనం, వారసత్వ గ్రామాధికార వ్యవస్థ రద్దు, అధిక పన్ను వసూలు వంటి చర్యలతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతినిందన్నారు. దీంతో పాలేగాళ్లు, రైతులు, కట్టబడీలు, గ్రామ సేవకులు, సంప్రదాయ పోలీసు వ్యవస్థపై ఆధారపడి జీవించే వర్గాలను ప్రభావితం చేశాయన్నారు. ఫలితంగా గ్రామీణ సమాజంలో తీవ్రస్థాయిలో అసంతృప్తి పెరిగిందన్నారు. ఈ క్రమంలో బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా మొదలైన ప్రజాతిరుగుబాటుకు నరసింహారెడ్డి నాయకత్వం వహించారన్నారు. ఆయన మరణించిన తేదీని వీరమరణ దినంగా గుర్తించారన్నారు. కార్యక్రమంలో పర్యాటక శాఖ అధికారి జయకుమార్, ఆన్‌సెట్ మేనేజర్ శ్రీనివాసులు, యువజన సంక్షేమ వాఖ సూపరింటెండెంట్ అన్వర్ బాషా, తదితరులు పాల్గొన్నారు.


