మొదలైన ‘సూర్య’ ప్రతాపం
● సీజన్ మొదట్లోనే సుర్రుమంటున్న ఎండలు
అనంతపురం అగ్రికల్చర్: వేసవి సీజన్ మొదలైనట్లు సూరీడు సంకేతాలు ఇస్తున్నాడు. ఇక నుంచి మూడు నెలల పాటు తన ప్రతాపాన్ని తట్టుకోవాలని ప్రజలను హెచ్చరిస్తున్నాడు. ఆదివారం ‘సన్’డే ఎఫెక్ట్ కనిపించింది. మధ్యాహ్న సమయంలో అప్పుడే రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఇన్నాళ్లూ ఉదయం వేళ చలిగింతలు కొనసాగుతుండగా.. గత రెండు రోజుల నుంచి పరిస్థితి మారిపోయింది. వారం రోజుల నుంచి మధ్యాహ్న సమయంలో ఎండ ప్రతాపం కనిపిస్తోంది. పగటి ఉష్ణోగ్రతలు కొన్ని ప్రాంతాల్లో గరిష్టంగా 37 డిగ్రీల మార్క్‌కు చేరుకుంది. మార్చి మొదటి వారానికి 40 డిగ్రీల మార్క్‌ను చేరుకునే పరిస్థితి ఉందని అధికారులు చెబుతున్నారు. దీంతో ఈసారి మూడు నెలల పాటు ఎండలు మండే పరిస్థితి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఏప్రిల్‌లో అయితే 45 డిగ్రీల మార్క్‌ను చేరుకోవచ్చని తెలుస్తోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా రాత్రిళ్లు, ఉదయం పూట 20 డిగ్రీల నుంచి 30 డిగ్రీల వరకు నమోదు కావచ్చని చెబుతున్నారు. దీంతో ఉక్కపోత పతాకస్థాయికి చేరుకోవచ్చంటున్నారు. అన్ని వర్గాలు వేసవి జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు.
మొదలైన ‘సూర్య’ ప్రతాపం


