చిన్న సమస్యలూ పెద్దసారు వద్దకే!
● ‘నీటి సరఫరా కోసం ఇళ్ల ముందు రోడ్డులో గాడీ తీసి పైప్‌లైన్ వేశారు. ఆ తరువాత రోడ్డును యథావిధిగా చదును చేయలేదు. వాహనాలు రాలేనంత అధ్వానంగా ఉంది. ఎన్నిసార్లు చెప్పినా గుంతలు పూడ్చడం లేదు’ అంటూ పరిష్కార వేదికలో తాడిపత్రి పట్టణం గన్నెవారిపల్లె కాలనీ గౌసియా మసీదు వీధికి చెందిన రామ లింగేశ్వరెడ్డి (డోర్ నెంబరు 3/1027–3) ఫిర్యాదు చేశాడు.
● ‘మా ఇంటి ముందున్న మురుగు కాలువను తొలగించాలని మూడుసార్లు అర్జీ ఇచ్చినా స్పందన లేదు. టోల్ ఫ్రీ నంబరుకు కాల్ చేస్తే అధికారులు వస్తారని చెబుతారు. అధికారులు వస్తారు.. వెళతారే తప్ప వారి నుంచి ఎలాంటి చర్యలూ ఉండటం లేదు. మురుగు కాలువ తొలగించేలా చర్యలు తీసుకోండి’ అని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఉరవకొండ పట్టణానికి చెందిన పప్పూరు పద్మావతి అర్జీ ఇచ్చింది.
● ‘మా ఇంటి కాంపౌండులో తీగలు లేని విద్యుత్ స్తంభం ఉంది. దాన్ని తొలగించాలని లైన్‌మెన్‌కు పలుమార్లు ఫిర్యాదు చేశాను. విద్యుత్ అధికారులకు చెప్పాను. వారెవరూ స్పందించలేదు. స్తంభం తొలగించేలా చర్యలు తీసుకోండి’ అని పరిష్కార వేదికలో కంబదూరు మండలం నూతిమడుగు గ్రామానికి చెందిన ఎం.వెంకటచలపతి ఫిర్యాదు చేశాడు.
● గ్రామస్థాయిలో పరిష్కారం కావాల్సిన ఇలాంటి సమస్యలు ప్రతి వారం కలెక్టరేట్ రెవెన్యూ భవన్‌లో కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక వద్దకు చాలానే వస్తుంటాయి.
అనంతపురం అర్బన్: ప్రజల సమస్యలపై గ్రామ, మండల స్థాయి అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఎన్నిసార్లు అర్జీలు అందజేసినా పరిష్కారానికి చర్యలు తీసుకోవడం లేదు. అధికారుల తీరుతో విసిగివేసారిన ప్రజలు చిన్న సమస్య అయినా సరే కలెక్టర్ దృష్టికి తీసుకురావాల్సి వస్తోంది. గత ఏడాది డిసెంబరు నుంచి ఇప్పటి వరకు రెండున్నర నెలల వ్యవధిలో 12,456 అర్జీలు అందాయి. ఇందులో రెవెన్యూ సమస్యలకు సంబంధించి 4,390 ఉండగా.. రెవెన్యూయేతర సమస్యలు 8,066 ఉన్నాయి. వీటిలో 7,717 అర్జీలు పరిష్కరించినట్లుగా చూపిస్తున్నారు. పరిష్కరించాల్సిన అర్జీలు 4,739 ఉన్నట్లు చెబుతున్నారు. అయితే సమస్యలకు చూపిన పరిష్కారంపై అర్జీదారులు సంతృప్తి చెందడం లేదు. దీంతో అవి రీ–ఓపెన్ అవుతున్నాయి. అలా 3,380 అర్జీలు రీ–ఓపెన్ అయ్యాయంటే సమస్యలకు నాణ్యమైన పరిష్కారం చూపడం లేదనే విషయం స్పష్టమవుతోంది.
కలెక్టర్ ప్రత్యేక దృష్టి పెట్టాలి..
గ్రామ, మండల స్థాయిలో పరిష్కారం అవ్వాల్సిన చిన్న సమస్యలూ జిల్లా కేంద్రంలో నిర్వహించే పరిష్కార వేదికకు రావడంపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించాలి. చిన్న సమస్యలనూ గ్రామ, మండల అధికారులు ఎందుకు పరిష్కరించడం లేదనే విషయాన్ని తీవ్రంగా పరిగణించాలి. ఏ స్థాయిలో పరిష్కరమవ్వాల్సిన సమస్యలు అక్కడే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది.
అర్జీల పరిష్కారంపై
దిగువస్థాయి అధికారుల అశ్రద్ధ


