ప్రాజెక్టులపై నిర్లక్ష్యమేల బాబూ..?
● వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు వై.విశ్వేశ్వరరెడ్డి
ఉరవకొండ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఏపీ సీఎం చంద్రబాబు చీకటి ఒప్పందం చేసుకుని రాయలసీమకు ద్రోహం చేశారని వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు, ఉరవకొండ నియోజకవర్గ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు. రాయలసీమ ఎత్తిపోతుల పథకం పనులు పునఃప్రారంభించాలని వైఎస్సార్‌సీపీ అధ్వర్యంలో గురువారం నిర్వహించతలపెట్టిన ‘చలో పోతిరెడ్డిపాడు’ కార్యక్రమ పోస్టర్లను బుధవారం ఉరవకొండలోని పార్టీ కార్యాలయంలో నాయకులతో కలిసి విశ్వ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు అధికారం చేపట్టినప్పటి నుంచి ఒక్క పెండింగ్ ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదన్నారు. సీమ జీవనాడి అయిన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఏకంగా తెలంగాణకు తాకట్టు పెట్టారని మండిపడ్డారు. రాయలసీమలో భవిష్యత్తు తరాలకు నీటి సమస్య తలెత్తకుండా ఉండాలంటే ఈ ప్రాజెక్టు పూర్తి చేయడం ఎంతో ముఖ్యమన్నారు.
‘హంద్రీ–నీవా’ సామర్థ్యం పెంచాలి
వైఎస్సార్‌సీపీ హయంలో హంద్రీ–నీవా కాలువ సామర్థ్యాన్ని ఆరువేల క్యూసెక్కులకు పెంచుతూ టెండర్లు పిలిచి, దీనికి సంబంధించిన పరిపాలనా అనుమతులు కుడా మంజురు చేశారని విశ్వ తెలిపారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం మూడు వేల క్యూసెక్కులకు కుదిస్తూ హంద్రీ–నీవా కాలువ వెడల్పు పనులు చేపట్టారన్నారు. ఈ పనులను కూడా రూ.3వేల కోట్లు ఖర్చు పెట్టి 100 రోజుల్లో అత్యంత నాసిరకంగా నిర్మించి చేతులు దులుపుకున్నారన్నారు. భూగర్భజలాలు అడుగంటేలా హంద్రీ–నీవాకు లైనింగ్ పనులు చేపట్టి రైతులకు తీరని అన్యాయం చేశారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికై నా కళ్లు తెరిచి హంద్రీ–నీవా కాలువను ఆరు వేల క్యూసెక్కుల సామర్థ్యంతో చేసి, హంద్రీ–నీవాను గాలేరు నగరికి అనుసంధానం చేయాలని డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లాలో బీటీ ప్రాజెక్టు, పేరూరు డ్యాంతో పాటు ఇతర ప్రాజెక్టులకు నీరు ఇవ్వాలంటే హంద్రీ–నీవా కాలువ సామర్థ్యం పెంచి వెడల్పు చేయడం ఒక్కటే మార్గమన్నారు. తిరుమల లడ్డూపై దుష్ప్రచారం చేస్తున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పి, వివాదాన్ని ఇంతటితో ముగించేలా చూడాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సీపీ వీరన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్తులూరు అశోక్, వైస్ ఎంపీపీ ఈడిగప్రసాద్, జెడ్పీటీసీ ఏసీ పార్వతమ్మ, మార్కెట్ యార్డు మాజీ చైర్‌పర్సన్ సుశీలమ్మ, కమలమ్మ, పార్టీ రాష్ట్ర నాయకులు బసవరాజు, ఏసీ ఎర్రిస్వామి, ఉరవకొండ, వజ్రకరూరు, విడపనకల్లు మండలాల కన్వీనర్లు ఎర్రిస్వామిరెడ్డి, ఓబన్న, సోమశేఖర్‌రెడ్డి, కురుబ డోనేకల్లు రమేష్, పార్టీ నాయకులు డిష్ సురేష్, కౌడిగి గోవిందు, రైతు విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు మేకల సిద్దార్థ్, జీఎంఎస్ మీరం బాషా, ఆసీఫ్, అంగదాల ఆంజి, నిమ్మల వెంకటరమణ, కాసుల ఆంజి, ఆరె రాజా, జోగి భీమా, జోగి హనమంతు, ప్రకాష్, వడ్డే ఆంజనేయులు, ఈశ్వర్, ధనుంజయ, సుద్దాల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
చలో పోతిరెడ్డిపాడు పోస్టర్లను ఆవిష్కరిస్తున్న విశ్వేశ్వరరెడ్డి


