గడ్డి కొరత.. పాడి కోత ! | - | Sakshi
Sakshi News home page

గడ్డి కొరత.. పాడి కోత !

Feb 5 2026 7:33 AM | Updated on Feb 5 2026 7:33 AM

గడ్డి కొరత.. పాడి కోత !

గడ్డి కొరత.. పాడి కోత !

అనంతపురం అగ్రికల్చర్‌: చలి కాలం ముగింపు దశకు చేరుకుంది. ఈ నెల రెండో పక్షం నుంచి వేసవి మొదలు కానుంది. మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో ఎండ లు దంచికొట్టనున్నాయి. జూన్‌లో వర్షాలు వచ్చేదాకా వేసవితాపం కొనసాగనుంది. మధ్యమధ్యలో అంటే ఏప్రిల్‌, మేలో ఈదురుగాలులు, అకాల వర్షాలకు అవకాశం ఉంది. పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా మండే అవకాశం ఉండగా... రాత్రిళ్లు కూడా 25 నుంచి 30 డిగ్రీల మధ్య ఉక్కపోత కొనసాగే వాతావరణం ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పశువులకు గడ్డి కొరత, తాగునీటికి ఇక్కట్లు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు పాడి ఉత్పత్తి కూడా తగ్గే పరిస్థితి ఉందని చెబుతున్నారు.

గ్రాసం కొరతకు కారణాలివే..

ఇటీవల కాలంలో అటు ఖరీఫ్‌, ఇటు రబీలో వేరుశనగ పంట సాగు బాగా తగ్గిపోవడంతో పశువుల మేత లభ్యత తగ్గిపోయినట్లు రైతులు చెబుతున్నారు. గతంలో జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్‌లో 10 లక్షల ఎకరాల్లో కేవలం వేరుశనగ సాగవుతుండగా.. ఇప్పుడు రెండు లక్షల ఎకరాలకు పడిపోయింది. వేరుశనగ స్థానంలో కంది, మొక్కజొన్న, ఆముదం తదితర పంటలు ఆక్రమించాయి. వీటి ద్వారా అనుకున్న స్థాయిలో గడ్డి లభించే పరిస్థితి లేదు. అంతో ఇంతో మొక్కజొన్న ద్వారా లభించనుంది. వరి సాగు స్థిరంగానే కొనసాగుతున్నా... పంటకోతలు దాదాపు యాంత్రీకరణ ద్వారా చేస్తుండటంతో అనుకున్న స్థాయిలో గడ్డి లభించే పరిస్థితి లేదు. వ్యవసాయ పంటల స్థానంలో ఇటీవల ఉద్యాన పంటలు, కూరగాయల సాగు పెరగడంతో గడ్డికి సమస్యగా మారింది. దీంతో చాలామంది రైతులు బళ్లారి, కర్నూలు, నంద్యాల ప్రాంతాలతో పాటు జిల్లాలో వరి సాగు అధికంగా ఉన్న రాయదుర్గం ప్రాంతం నుంచి వరి గడ్డి కొనుగోలు చేసి నిల్వ చేసుకుంటున్నారు. ట్రాక్టర్‌ గడ్డి రూ.10 వేల ప్రకారం నడుస్తుండటంతో రైతులకు భారంగా మారిందని చెబుతున్నారు. వేరుశనగ పంట తగ్గిపోవడంతో జీవాలకు కూడా సమస్యగా ఉంటుందని తెలుస్తోంది.

పాడి ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం..

ఈ వేసవిలో లక్ష టన్నుల వరకు గడ్డి కొరత ఏర్పడవచ్చని పశు శాఖ వర్గాలు చెబుతున్నాయి. అయితే పశుదాణా, టీఎంఆర్‌ (దాణామృతం), ఎండుగడ్డి లాంటివి రాయితీతో పంపిణీ చేసే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో వేసవి గండం నుంచి గట్టెక్కడానికి పాడి రైతులు నానాపాట్లు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 1.94 లక్షలు పశువులు, 1.61 లక్షలు గేదెలు ఉండగా.. 29 లక్షల గొర్రెలు, 4.82 లక్షల మేకల సంపద ఉన్నట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయి. ఏడాదికి జిల్లాలో 5 లక్షల మెట్రిక్‌ టన్నుల పాల ఉత్పత్తి ఉన్నట్లు పశుశాఖ లెక్కలు వెల్లడిస్తున్నాయి. అంటే రోజుకు 13.75 లక్షల లీటర్లు పాల ఉత్పత్తి జరుగుతోంది. వర్షాకాలం, చలికాలంలో పాడి ఉత్పత్తి బాగానే ఉన్నా.. వేసవిలో గడ్డి కొరత, నీటి సమస్య కారణంగా రోజుకు రెండు లక్షల లీటర్లకు పైగా పాల ఉత్పత్తి తగ్గవచ్చని అంచనా వేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement