27 నుంచి ఖాద్రీశుడి బ్రహ్మోత్సవాలు
కదిరి టౌన్: కోరి కొలిచిన భక్తుల కొంగుబంగారంగా వెలుగొందుతున్న ఖాద్రీ లక్ష్మీనారసింహుని బ్రహ్మోత్సవాలు ఈ నెల 27వ తేదీ ప్రారంభం కానున్నాయి. 15 రోజుల పాటు జరిగే ఉత్సవాలు మార్చి 13వ తేదీ మహాసంప్రోక్షణతో ముగియనున్నాయి. ఉత్సవాల సందర్భంగా శ్రీవారు రోజుకో అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ మేరకు ఆలయ ఈఓ వి.శ్రీనివాసరెడ్డి బ్రహ్మోత్సవాల వివరాలను బుధవారం విలేకరులకు తెలిపారు. ఫాల్గుణ శుద్ధ ఏకాదశి ఈనెల 27వ తేదీ (శుక్రవారం) రాత్రి ఖాద్రీశుని బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు. 28వ తేదీ ఉదయం ధ్వజారోహణం, రాత్రి శ్రీవారి కల్యాణోత్సవం ఉంటుంది. మార్చి 1వ తేదీ హంస వాహనం, 2న సింహ వాహన సేవలు, 3న హనుమంతవాహనం, 4న బ్రహ్మగరుడసేవ, 5న శేష వాహనం, 6వ తేదీ ఉదయం సూర్యప్రభ, రాత్రి చంద్రప్రభ వాహన సేవ. 7న మోహినీఉత్సవం. 8న ప్రజాగరుడసేవ, 9న గజవాహనం, 10వ తేదీన కీలకమైన బ్రహ్మరథోత్సవం, 11న అలుకోత్సవం, అశ్వవాహన సేవ, 12వ తేదీన తీర్థవాది. 13వ తేదీ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈఓ తెలిపారు. భక్తులు అందరూ పాల్గొని శ్రీవారి బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయాలన్నారు.
విశిష్ట సంఖ్యతోనే
ప్రభుత్వ ప్రయోజనాలు
అనంతపురం అగ్రికల్చర్: ప్రభుత్వ ప్రయోజనాలు వర్తించాలంటే రైతులకు 11 అంకెల విశిష్ట సంఖ్య (యూనిక్ నంబర్) తప్పనిసరి చేశారని వ్యవసాయశాఖ జిల్లా అఽధికారి ముదిగల్లు రవి తెలిపారు. ఈ నంబరు కలిగిన రైతులకు మున్ముందు ఇన్‌పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్, విత్తనాలు, ఎరువులు, పీఎం కిసాన్, సుఖీభవ, యాంత్రీకరణ పరికరాలు, ఈ–క్రాప్, ఎంఎస్‌పీ అమ్మకాలు, ఇతరత్ర పథకాలు, కార్యక్రమాలు వర్తిస్తాయని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆధార్ కార్డు మాదిరిగా ప్రతి రైతుకూ 11 నంబర్లతో కూడిన ప్రత్యేక విశిష్ట సంఖ్య (ఫార్మర్ రిజిస్ట్రీ ఐడీ) ఇవ్వడానికి వ్యవసాయశాఖ పని చేస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్ ఫార్మర్ రిజిస్ట్రీ (ఏపీఎఫ్‌ఆర్) కింద అగ్రిస్టాక్ యాప్ కింద రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నట్లు తెలిపారు. రైతు పట్టాదారు పాస్‌పుస్తకం, ఆధార్‌కార్డు, వాటికి అనుసంధానం అయిన మొబైల్ నంబరు ద్వారా రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత రైతుకు 11 నంబర్లతో కూడిన ఐడీ నంబరు కేటాయిస్తున్నారన్నారు. ఇందుకు మూడు సార్లు ఓటీపీ సక్సెస్ కావాల్సి ఉంటుంది. ఆర్‌ఎస్‌కే అసిస్టెంట్లు, వ్యవసాయశాఖ అధికారులను సంప్రదించి నేరుగానూ లేదా ఓటీపీ ద్వారా వెంటనే రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా 3,42,666 మంది రైతులకు యూనిక్ నెంబర్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటికే 2,73,403 మందికి విజయవంతంగా పూర్తయిందన్నారు. మిగలిన 69,263 మంది రైతులకు విశిష్ట సంఖ్య ఇవ్వడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పెద్దవడుగూరు, పెద్దపప్పూరు, గుత్తి, రాయదుర్గం, యాడికి, తాడిపత్రి, గుంతకల్లు తదితర 15 మండలాల్లో 70 నుంచి 95 శాతం వరకు నమోదు కాగా.. మిగతా మండలాల్లో వెనుకబడ్డాయని తెలిపారు.
ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్మ
రాప్తాడురూరల్: పోలీసు ఏఆర్ విభాగంలో హెడ్‌కానిస్టేబుల్ (హెచ్‌సీ)గా పని చేస్తున్న సాకే సుబ్బరాజు (51) ఆత్మహత్య చేసుకున్నాడు. ధర్మవరం రైల్వే పోలీసులు తెలిపిన మేరకు... అనంతపురం ఏఆర్‌లో పని చేస్తున్న సుబ్బరాజు కుటుంబం నవోదయకాలనీలో నివాసం ఉంటోంది. ఈయనకు భార్య, పిల్లలు ఉన్నారు. ఏమైందో ఏమో తెలియదు కానీ బుధవారం సాయంత్రం రాప్తాడు మండలం ప్రసన్నాయపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. తల, మొండెం వేర్వేరయ్యాయి. ఆయన జేబులో ఉన్న ఆధార్, ఐడీ కార్డు ఆధారంగా ఏఆర్ హెచ్‌సీగా గుర్తించారు. అయితే సుబ్బరాజు ఆత్మహత్యకు గల కారణాలు తెలియడం లేదు. ఎడమకాలి పాదం వద్ద బ్యాండేజీ ధరించి ఉన్నాడు. ఏదైనా గాయం కారణంగా చికిత్స చేయించుకున్నట్లు తెలుస్తోంది. అనారోగ్యమా? లేదంటే కుటుంబ కులహాలా? మరేదైనా కారణమా? అనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. సమాచారం అందుకున్న భార్య, పిల్లలు మృతదేహాన్ని చూసి బోరున విలపించారు.
27 నుంచి ఖాద్రీశుడి బ్రహ్మోత్సవాలు


