
యూరియా.. రాదేమయా..
అనంతపురం అగ్రికల్చర్: యూరియా సరఫరా ఆలస్యమవుతోంది. సోమవారం ఇఫ్కో కంపెనీ నుంచి 1,022 మెట్రిక్ టన్నుల డీఏపీతో పాటు 20–20–0–13 రకం కాంప్లెక్స్ వచ్చింది. ఇక మంగళవారం కూడా కోరమాండల్ ఇంటర్నేష నల్ కంపెనీ నుంచి 2,200 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్‌లు జిల్లాకు చేరాయి. అందులో 14–34–14 రకం 1,100 మెట్రిక్ టన్నులు కాగా 20–20–0–13 రకం 1,100 మెట్రిక్ టన్నులు ఉన్నట్లు రేక్ ఆఫీసర్, ఏడీఏ అల్తాఫ్ అలీఖాన్ తెలిపారు. అవసరం లేని ‘కాంప్లెక్స్’ జిల్లాకు చేరుతుండగా... రైతుల నుంచి డిమాండ్ ఉన్న యూరియా మాత్రం ఒక బస్తా కూడా సరఫరా కావడం లేదు. ఇప్పటికే జిల్లా అంతటా యూరియా నిల్వలు దాదాపు ఖాళీ అయ్యాయి. కేవలం మార్క్‌ఫెడ్ దగ్గర బఫర్‌స్టాక్ కింద 700 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నా దాన్ని బయటకు తీయడం లేదు. జిల్లా వ్యవసాయశాఖ ఇండెంట్ పెట్టకుండా ఆలస్యం చేస్తుండటంతో బఫర్‌స్టాక్ అలాగే ఉండిపోయినట్లు చెబుతున్నారు. ఇదే క్రమంలో స్పిక్ కంపెనీ నుంచి వస్తుందనుకున్న యూరియా రావడం ఇంకా ఆలస్యం కావొచ్చని చెబుతున్నారు. దాంతో పాటు ఇండియన్ పొటాష్ లిమిటెడ్ (ఐపీఎల్), అలాగే రాష్ట్రీయ కెమికల్ అండ్ ఫర్టిలైజర్స్ (ఆర్‌సీఎఫ్) కంపెనీల నుంచి కూడా యూరియా రానుందని అధికారులు చెబుతున్నారు. అయితే, ఎప్పుడు.. ఎన్ని మెట్రిక్ టన్నులు అనే విషయంపై స్పష్టత ఇవ్వడం లేదు.
లెక్కలు సరి చేసుకుంటూ..
యూరియా అధికంగా కేటాయించినా కొరత ఏర్పడటంపై రాష్ట్ర మంత్రి పయ్యావుల కేశవ్ అధికారులపై సోమవారం జరిగిన ‘డీఆర్‌సీ’లో సీరియస్ అయ్యారు. సాగు తక్కువగా ఉన్నా ఎందుకిలా జరిగిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అటు వ్యవసాయ శాఖ, ఇటు మార్క్‌ఫెడ్ అధికారులు, అలాగే హోల్‌సేల్ డీలర్లు, సొసైటీలు, రీటైలర్ల నుంచి పక్కదారి పట్టిన యూరియా లెక్కలను సరి చేసుకునే పనిలో పడినట్లు సమాచారం. ప్రధానంగా యూరియాకు సంబంధించి గత ఖరీఫ్, రబీలో మిగులు ఎంత ఉంది (ఓపెనింగ్ బ్యాలెన్స్), ఈ ఏడాది కేటాయింపులు, కంపెనీల వారీగా నెలవారీ సరఫరా ఎంత, ఇండెంట్ ప్రకారం ఎవరెవరికి ఎంత సరఫరా చేశారు. అందులో ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ హోల్‌సేల్ డీలర్లకు ఎంత ఇచ్చారు.. దాన్ని ఎంత మంది రైతులకు పంపిణీ చేశారనే వివరాలు చెప్పడానికి అధికారుల వద్ద కచ్చితమైన గణాంకాలు లేకపోవడం గమనార్హం. కూటమి సర్కారు, వ్యవసాయశాఖ ఉదాసీనత కారణంగా ఈ ఏడాది రైతులను యూరియా సమస్య వేధిస్తోంది. రోడ్డెక్కి నిరసన గళం వినిపిస్తున్నా.. కార్యాలయాలకు తాళాలు వేసి ధర్నాలు చేస్తున్నా స్పందన కరువైంది. అధికారులు చెబుతున్నట్లు వారాంతంలోపు యూరియా సరఫరా కాకుంటే రైతుల నుంచి ప్రతిఘటన తీవ్రమయ్యే ప్రమాదం పొంచి ఉంది.
తాజాగా జిల్లాకు మరో 2,200 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్
అదిగో ఇదిగో అంటున్నా రాని యూరియా
రైతులకు తప్పని ఇబ్బందులు