
పింఛన్లు పునరుద్ధరించాల్సిందే
శింగనమల: కుట్రపూరితంగా తొలగించిన దివ్యాంగుల పింఛన్లను పునరుద్ధరించాల్సిందేనని వైఎస్సార్ సీపీ నాయకులు స్పష్టం చేశారు. లేకుంటే దివ్యాంగులతో కలిసి ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మంగళవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ఎదుట వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ పూల ప్రసాద్ ఆధ్వర్యంలో దివ్యాంగులతో కలిసి ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ మాజీ సమన్వయకర్త వీరాంజనేయులుతో పాటు పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ధర్నాకు వికలాంగుల సంఘం మండల అధ్యక్షుడు తరిమెల నారాయణ మద్దతు ప్రకటించి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తమ నియోజకవర్గంలో దాదాపు 4 వేల మంది దివ్యాంగులకు నోటీసులు అందజేశారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేక నేడు కుట్రలకు తెరలేపారన్నారు. దివ్యాంగులకు అందజేసిన నోటీసులను వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. నడవలేని వారు, బుద్ధిమాంద్యం వారికీ నోటీసులివ్వడం దారుణమన్నారు. అనంతరం ఇన్‌చార్జ్ ఎంపీడీఓ భాస్కర్‌కు వినతిపత్రం అందజేశారు. సెప్టెంబరు 1న ఒక్క దివ్యాంగుడి పింఛన్ తొలగించినట్లు ప్రకటించినా ఎంపీడీఓ కార్యాలయాన్ని ముట్టడిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ నరసింహులు, మండల కో–ఆప్షన్ మెంబరు ఆలీ బాషా, సర్పంచ్ వెంకటరాముడు, వైఎస్సార్‌సీపీ నాయకులు భాస్కర్‌రెడ్డి, గొల్లారెడ్డి, నూరు మహమ్మద్, వెంకటరమణ, శ్రీనివాసులు, విజయ్, మల్లికార్జునరెడ్డి, జగన్, కోటిరెడ్డి, వెంకటప్ప, నాగముని, వీరాంజి నేయులు తదితరులు పాల్గొన్నారు.